అమెరికా-ఇరాక్ మ‌ధ్య మ‌రోమారు యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ద‌ళానికి చెందిన అధిప‌తి జ‌న‌ర‌ల్ ఖాసిమ్ సులేమానిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. బ‌గ్దాద్ విమానాశ్ర‌య స‌మీపంలో కారులో వెళ్తున్న సొలేమ‌నిపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి చేశాయి. ఈ ఉద‌యం జ‌రిగిన దాడిలో సులేమాని ప్రాణాలు కోల్పోయాడు. అయితే, దీనిపై అమెరికా- ఇరాక్‌పై మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. బాగ్దాద్‌లో ఇరాన్‌ టాప్ మిలిట‌రీ క‌మాండ‌ర్ ఖాసిం సులేమానిని హ‌త‌మార్చిన నేప‌థ్యంలో ఇరాక్‌లో సంబ‌రాలు మొద‌లైన‌ట్లు అమెరికా పేర్కొంది.

 

 

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేర‌కే అమెరికా జ‌రిపిన వైమానిక దాడిలో ఇవాళ ఉద‌యం ఖాసిం సులేమాని చ‌నిపోయాడు. అయితే ఖాసిం సులేమాని మ‌ర‌ణంతో ఇరాకీలు ఆనందోత్స‌హాల్లో తేలిన‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో పోస్టు చేశారు. ఇరాకీ జాతీయ జెండాలు, బ్యాన‌ర్ల‌తో జ‌నం వీధుల్లో ప‌రుగులు తీస్తున్న వీడియోను పొంపియో పోస్టు చేశారు. త‌మ జ‌న‌ర‌ల్‌ను తుది ముట్టించిన వారిపై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ దేశాధ్య‌క్షుడు హ‌స‌న్ రోహ‌నీ తెలిపారు. ఇరాన్‌తో పాటు ప్రాంతీయ దేశాల‌న్నీ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఇరాక్‌లోని హ‌షీద్ అల్ షాబీ మిలిట‌రీ ద‌ళానికి చెందిన క‌మాండ‌ర్ పిలుపునిచ్చారు. అమెరికా దాడితో అంద‌రూ అల‌ర్ట్‌గా ఉండాల‌న్నారు.

 

 

రాబోయే ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష రేసులో ఉన్న అమెరికా మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ స్పందిస్తూ...జ‌న‌ర‌ల్ ఖాసిం సులేమానికి మృతిపై ట్రంప్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఇరాన్‌ జ‌న‌ర‌ల్ హ‌త్య అతిపెద్ద త‌ప్పిద‌మ‌ని  బైడెన్ తెలిపారు. అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతంలో ట్రంప్ ఓ డైన‌మైట్‌ను పేల్చార‌న్నారు. సులేమాని హత్య‌కు సంబంధించి అమెరికా ప్ర‌జ‌ల‌కు ట్రంప్ స‌మాధానం ఇవ్వాల్సి ఉంద‌న్నారు. అమెరికా ద‌ళాల ర‌క్ష‌ణ బాధ్య‌త ఆయ‌న‌దే అన్నారు. కాగా, ఈ వివాదంలో చైనా ఎంట‌ర్ అయింది. అమెరికా, ఇరాన్ సంయ‌మ‌నం పాటించాల‌ని డ్రాగ‌న్ దేశం చైనా కోరింది. విదేశాంగ ప్ర‌తినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ రెండు దేశాలు ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించాల‌న్నారు. రెండు వ‌ర్గాలు, మరీ ముఖ్యంగా అమెరికా కాస్త త‌మ దూకుడును త‌గ్గించాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: