ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సభ్యులతో కొంతసేపటి క్రితం సమావేశమయ్యారు. సీఎం జగన్ కు ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు జగన్ తో సమావేశమైన బీసీజీ ఇప్పటికే నివేదికను అందజేసింది. సమగ్రాభివృద్ధి, సమతుల్యాభివృద్ధి లక్ష్యంగా బీసీజీ కమిటీ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నెల 6వ తేదీన రెండు నివేదికలను హై పవర్ కమిటీ పరిశీలించనుంది. 
 
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన ఈ నెల 6వ తేదీన తొలిసారి సమావేశం జరగనుంది. ఈ కమిటీ మూడు వారాలలో తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. సంక్రాంతి పండుగ తరువాత హై పవర్ కమిటీ నివేదికను సీఎంకు సమర్పించనుంది. ప్రపంచస్థాయి నగరంగా అమరావతి నిర్మించడం ఏ మేరకు సాధ్యమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 
 
రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇప్పటికే ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక కూడా అభివృద్ధి వికేంద్రీకరణకే మొగ్గు చూపుతూ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగానే ఈ నివేదిక ఉన్నట్టు తెలుస్తోంది. 
 
పాలనాపరంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైపవర్ కమిటీ సిఫార్సులు ఎలా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివిధ రంగాలలో నిపుణులైన బోస్టన్ కమిటీ అన్ని జిల్లాల పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసే నివేదికను పూర్తి స్థాయి నివేదికను అందజేసింది. సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటనకు అనుకూలంగానే హై పవర్ కమిటీ నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: