జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే.  నిజానికి రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లోని రైతులు భూములిస్తే ఆందోళనలు జరుగుతున్నది మాత్రం కేవలం ఓ ఐదారు గ్రామాల్లోనే. మరి మిగిలిన గ్రామాల పరిధుల్లో ఎందుకు ఆందోళనలు జరగటం లేదు ? ఇదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.

 

ఇదే విషయాన్ని అక్కడి జనాలను విచారిస్తే అసలు ఆందోళనలకు నష్టం జరుగుతోందే చంద్రబాబునాయుడు వల్ల అంటూ మండిపడ్డారు కొందరు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుండి మొత్తం వ్యవహారమంతా కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖుల చేతుల మీదగానే జరిగింది. అసలు అమరావతిని ఎంపిక చేసిందే కమ్మ సామాజికవర్గం ప్రయోజనాల కోసమే అనే ప్రచారం, ఆరోపణలకు   తర్వాత జరిగిన పరిణామాలు  ఊతమిచ్చాయి.

 

కారణాలేవైనా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇపుడు జరుగుతున్న గొడవల్లో కూడా కమ్మ సామాజికవర్గం నేతలు, జనాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజానికి రాజధాని గ్రామాల్లో కమ్మ సామాజికవర్గం ప్రజలకన్నా మిగిలిన సామాజికవర్గం జనాలే ఎక్కువని చంద్రబాబు చెబుతున్నదంతా సొల్లే అని తేలిపోయింది.

 

గ్రామాల్లో జనాభా ఎవరిదెంత అన్నది పక్కనపెడితే ఆధిపత్యం ఏ సామాజికవర్గంది అన్నదే ముఖ్యం.  ఆధిపత్యం చూస్తే చాలా వరకూ కమ్మోళ్ళ చేతుల్లోనే ఉంటోంది. చివరకు ఇపుడు ఆందోళనల్లో కూడా వాళ్ళే కనబడుతున్నారు.  ఈ విషయాల వల్లే మిగిలిన సామాజికవర్గాల్లోని చాలామంది ఆందోళనల విషయంలో పట్టనట్లున్నారు.

 

ఈ విషయాలను గ్రహించకుండా చంద్రబాబు పదే పదే ఉద్యమంలో హైలైట్ అవుతుంటే చాలామందికి మండిపోతోంది. చివరకు  ఉద్యమ విరాళాలు ఇచ్చిన నారా భువనేశ్వరి, చంద్రబాబు, విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు,  ఎన్ఆర్ఐ బుచ్చిబాబు చౌదరి, మాజీ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి, కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ  ఛైర్మన్  దారపనేని చంద్రశేఖర్ చౌదరి, గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు కూడా కమ్మోరే కావటం విచిత్రం. మరి మిగిలిన సామాజికవర్గం వాళ్ళెవరూ విరాళాలివ్వలేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: