బోస్టన్ కమిటీ నివేదికను కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. పెట్టుబడులు - రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణంతో ఆర్థిక భారం పెరుగుతుందని చెప్పారు. అమరావతిపై లక్షా 10 వేల కోట్లు పెట్టడం అవసరమా...? అని ప్రశ్నించారు. అమరావతి భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవని అమరావతి నిర్మాణానికి రుణం తెస్తే ప్రతి సంవత్సరం 10వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాలని అన్నారు. 
 
నీటిపారుదలపై అమరావతిపై పెట్టే లక్ష కోట్లను పెడితే మంచి ఫలితాలు వస్తాయని విజయ్ కుమార్ అన్నారు. అమరావతికి గతంలో వరదలు వచ్చిన నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు రిస్క్ అని కమిటీ పేర్కొందని చెప్పారు. విశాఖలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని 15 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారని అన్నారు. విజయవాడలాంటి చోట్ల మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. 
 
బీసీజీ విశాఖ, విజయవాడ, కర్నూలును ప్రధానంగా భావించి దృష్టి సారించాలని చెప్పిందని పేర్కొన్నారు. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ సహా ఏడు కీలక విభాగాలు ఉండొచ్చని అన్నారు. అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ విశాఖలో ఉండొచ్చని అన్నారు. అప్పిలేట్ అథారిటీలు, హైకోర్టు కర్నూలులో ఉండాలని బీసీజీ సూచించిందని తెలిపారు. ఎడ్యుకేషన్ విషయంలో విజయవాడకు, టూరిజం విషయంలో విశాఖకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ సూచించిందని అన్నారు. 
 
40 సంవత్సరాలలో ఒక నగరంపై లక్ష కోట్ల రూపాయలు పెడితే అభివృద్ధి చెందే అవకాశం ఉందని కానీ ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితిలో ఏపీ లేదని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. అమరావతిలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం రిస్క్ అని బీసీజీ కమిటీ చెప్పిందని విజయ్ కుమార్ వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: