భార‌తీయ వ్యాపార దిగ్గ‌జ సంస్థ టాటా గ్రూప్ అంత‌ర్గ‌త ప‌రిణామాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. టాటా గ్రూప్ చైర్మ‌న్‌గా సైర‌స్ మిస్త్రీ నియామ‌కం, తొల‌గింపు, పున‌ర్ నియ‌మించ‌డం ఆ కంపెనీని కోర్టు పాలు చేసింది. టాటా గ్రూపున‌కు ప్ర‌స్తుత‌ టాటా స‌న్స్ గౌర‌వ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా సుమారు 55 ఏళ్ల పాటు సేవ‌లు అందించారు. ఆయ‌న 2012లో త‌న బాధ్య‌త‌ల‌ను సైర‌స్ మిస్త్రీకి అప్ప‌గించారు. అయితే, మూడేళ్ల‌ క్రితం సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా టాటాలు తొలగించిన విషయం తెలిసిందే. టాటా గ్రూపు చైర్మ‌న్‌గా మిస్త్రీని నియ‌మిస్తూ ఇటీవ‌ల ఎన్‌సీఎల్ఏటీ తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. మిస్త్రీని పున‌ర్ నియ‌మించ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ ఇవాళ టాటా స‌న్స్ గౌర‌వ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఆ తీర్పు వ్య‌వ‌స్థీకృత నియమావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు ఉంద‌ని ర‌త‌న్ టాటా త‌న అపీల్‌లో పేర్కొన్నారు. ఎన్‌సీఎల్ఏటీ తీర్పు మోస‌పూరితంగా, షేర్‌హోల్డ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని ర‌త‌న్ తెలిపారు.  టాటా స‌న్స్ ఇప్ప‌టికే ఈ కేసులో సుప్రీంను ఆశ్ర‌యించింది.  

 


 గత నెల 18న టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రిని పునర్నియమిస్తూ నేషనల్‌ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకాన్ని అక్రమంగా పేర్కొన్న సంగతీ విదితమే. దీన్ని వ్యతిరేకిస్తూ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో టాటా సన్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ తీర్పుపై స్టే విధించాలని అందులో కోరింది. ఈ నెల 9న టీసీఎస్‌ బోర్డు సమావేశం జరుగనుండగా, వెంటనే దీనిపై విచారణ జరుపాలని కోర్టును టాటా తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ప్రస్తుతం క్రిస్మస్‌ సెలవులుండగా, కోర్టు 6న తిరిగి తెరుచుకోనున్నది. దీంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయని టాటా సన్స్‌ లాయర్లు చెబుతున్నారు. తమ తీర్పుపై సుప్రీం కోర్టులో టాటా సన్స్‌ అప్పీల్‌ చేసుకోవచ్చన్న ఎన్‌సీఎల్‌ఏటీ.. నాలుగు వారాల గడువిచ్చినది తెలిసిందే. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశం టాటా గ్రూప్‌లోని పలు సంస్థల్లో అయోమయానికి గురిచేస్తున్నదని, ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్లలో ఉన్న కంపెనీలను ప్రభావితం చేస్తున్నదని తమ పిటిషన్‌లో టాటా సన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక టాటా సన్స్‌ కార్పొరేట్‌ నిర్మాణం, పాలనలపై మదుపరులలో శతాబ్ద కాలానికిపైగా ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నదని చెప్పింది. నిజానికి మార్చి 2017లోనే టాటా సన్స్‌ చైర్మన్‌, డైరెక్టర్‌గా మిస్రీ పదవీకాలం పూర్తయ్యిందని, పునర్నియామకం చెల్లదని తెలిపింది. గ్రూప్‌లోని అన్ని సంస్థల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు, భాగస్వాముల నిర్ణయంతోనే మిస్త్రీకి ఉద్వాసన పలికామని గుర్తుచేసింది. ఇక ‘పబ్లిక్‌ కంపెనీ’ అంశంలోనూ ఎన్‌సీఎల్‌ఏటీ అభ్యంతరకర ఆదేశాలు ఇచ్చిందన్నది.

 


కాగా, త‌న పిటిష‌న్‌లో ర‌త‌న్ టాటా ఆస‌క్తిక‌ర విష‌యాలు పేర్కొన్నారు. టాటా స‌న్స్ పున‌ర్ నిర్మాణంలో త‌న జీవితం అంతా గ‌డిచిపోయింద‌ని, టాటా ఆప‌రేటింగ్ కంపెనీల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా మేటి స్థానానికి తీసుకువ‌చ్చిన‌ట్లు ర‌త‌న్ చెప్పారు. త‌న‌కు, మిస్త్రీకి మ‌ధ్య 500 ఈమెయిల్స్ సంభాష‌ణ సాగిన‌ట్లు తీర్పులో పేర్కొన్నార‌ని, కానీ అలా జ‌ర‌గ‌లేద‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: