రాజధాని వ్యవహారంలో అమరావతిపై జరుగుతున్న రాద్ధాంతంలో అన్ని పార్టీల నేతలు తల దూరుస్తూ ఏదో ఒక ఒక అంశాన్ని హైలెట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఈ విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ తాను అమరావతికి కట్టుబడి ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతుండగా, విశాఖ జిల్లా నేతలు జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. అయితే బిజెపిలో కీలక నాయకురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి మాత్రం ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు.


 రాజధాని అమరావతి నుంచి తరలించడం సరికాదంటూ జగన్ ప్రకటన తరువాత ఈమె వ్యాఖ్యానించడంతో విశాఖ జిల్లాలో ఆమె తీరుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో భయపడిన సైలెంట్ అయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే విశాఖ నుంచి గతంలో ఒకసారి ఎంపీగా గెలిచిన పురంధరేశ్వరి, గత ఎన్నికల్లోనూ విశాఖ నుంచి బరిలోకి దిగారు. ఆమె కోసం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కంభంపాటి హరిబాబు కూడా బీజేపీ అధిష్టానం తప్పించి మరీ ఆ సీటును కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో విశాఖ కు వ్యతిరేకంగా ప్రచారం ఎక్కువవడంతో ఆమె వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం తగిన నిర్ణయం ప్రకటించిన తర్వాత మాత్రమే స్పందించాలని, అప్పటి వరకు వేచి చూసే ధోరణిని అవలంబించాలని ఆమె భావిస్తున్నారట.


 అలాగే మూడు రాజధానుల అంశంపై ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత తన అభిప్రాయం ఏంటో బహిరంగంగా ప్రకటించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బిజెపి ముఖ్య నాయకులకు కూడా అమరావతి విషయంలో స్పష్టమైన క్లారిటీ లేకుండా పోయింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అమరావతికి మద్దతుగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా , మరో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోని అంశమని, దీంతో బీజేపీ కి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా ఉంది బీజేపీ నాయకుల వ్యవహారం.

మరింత సమాచారం తెలుసుకోండి: