రాజధానిలో చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదంటూ  మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంధించిన అస్త్రం బూమరాంగ్ అయిందా ? అంటే అవుననే అన్పిస్తోంది . రాష్ట్ర పౌరుడైన వారు రాజధాని లో ఇల్లు కట్టుకోరా ? అంటూ చంద్రబాబును ప్రశ్నించిన  ఆర్కే , చంద్రబాబు, లోకేష్ లు రాజధాని లో ఇల్లు కట్టుకోకుండా లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటూ గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా , మంత్రిగా హెచ్ ఆర్ ఏ తీసుకున్నారని  విమర్శించారు . ఇక అదే సమయం లో  తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి , రాష్ట్ర రాజధాని ప్రాంతం తాడేపల్లిలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారని చెప్పుకొచ్చారు .  ఇప్పడు ఇదే అంశాన్ని టీడీపీ నాయకత్వం టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది .

 

తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసముంటున్న భవనం ఆయనది కాదని ఆయన బినామీలదని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు . బినామీల భవన  మరమ్మత్తుల   కోసం రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని జగన్మోహన్ రెడ్డి 42  కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు . జగన్మోహన్ రెడ్డి ఉంటున్న భవనం బినామీలదట కదా అని మీరు కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలని ప్రశ్నించాలని ఈ సందర్బంగా వర్ల రామయ్య  మీడియా ప్రతినిధులకు సూచించారు . 

 

తాడేపల్లిలో జగన్ నివాసం గురించి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందిస్తూ అది కంపెనీల పేరిట ఉన్న బినామీ భవన మని అన్నారు . అది ఒక్కటే కాదని  హైదరాబాద్ లోని లోటస్ పాండ్ , బెంగళూరు నివాసాలు కూడా బినామీల పేరిట ఉన్నాయని చెప్పుకొచ్చారు . జగన్మోహన్ రెడ్డి తిరిగే వాహనాలు కూడా ఆయన పేరిట లేవని బినామీల పేరిటే ఉన్నాయని పేర్కొన్నారు  . జగన్ బ్రతుకే బినామీ అంటూ పయ్యావుల కేశవ్  విమర్శించారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: