ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖ వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే జరిమానాలతో సరిపెట్టుకునేది. కానీ ఇకనుండి రూల్స్ కఠినతరం కాబోతున్నాయి. గత సంవత్సరం రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 88,872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడ్డారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి వలనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గతంలో అధికారులు గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో రవాణాశాఖకు రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ పలు సూచనలు చేసింది. ఇకనుండి లైసెన్సులు లేకుండా వాహనాలను నడిపే వారిని జైలుకు పంపాలని కమిటీ రవాణాశాఖకు సూచించింది. కమిటీ సూచనలతో ఏపీ రవాణా శాఖ కూడా నిబంధనలకు కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2019 సంవత్సరంతో పోలిస్తే 20 శాతం ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో రవాణాశాఖ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టనుంది. 
 
సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలు చేపట్టి లైసెన్సులు లేనివారిపై కఠిన చర్యలు తీసుకోవటానికి రవాణాశాఖ సిద్ధమైంది. మరోవైపు రవాణాశాఖ అధికారులు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను సులభం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం లైసెన్స్ పొందాలనుకునేవారికి  విద్యార్హతను తొలగించాలని సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ నిబంధనను తొలగించాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రభుత్వం ఎనిమిదో తరగతి నిబంధనను తొలగించింది. త్వరలో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు కూడా ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఇకనుండి డ్రైవింగ్ లైసెన్సులు పొందాలనుకునేవారు కూడా డ్రైవింగ్ లైసెన్సులను సులభంగా పొందవచ్చు. ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సులభతరం కాగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే మాత్రం జైలు శిక్ష అనుభవించక తప్పడు. మరి వాహనదారులు ఏపీ రవాణాశాఖ అమలు చేయనున్న ఈ నిర్ణయం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: