అమరావతిలో రాజధాని కొనసాగుతుందని, ప్రభుత్వానికి తరలించే ఉద్దేశం లేదని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం మాత్రం పట్టించుకోవడం లేదు. అమరావతికి జగన్ అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళన చేస్తూనే ప్రజలను రెచ్చగొడుతూనే ఉంది. టిడిపి ఇంత కసిగా అమరావతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం కూడా అనుమానిస్తోంది. ముఖ్యంగా బినామీ పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, ఇదంతా రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే జరిగిందని వైసిపి కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా సీఎం జగన్ ప్రకటించారు. 


దానిలో భాగంగా ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు, తరువాత జరిగిన కొనుగోళ్ల లావాదేవీలను బయటకు తీస్తోంది. 33 వేల ఎకరాల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తోంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ లో  800 మంది, 80 మంది తెలంగాణకు చెందిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు వారి పూర్తి వివరాలను సేకరించిన ప్రభుత్వం ఆదాయపన్ను శాఖకు వాటిని అందించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో బినామీ పేర్లతో భూములు కొన్న వారు ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర నమ్మకంగా ఉన్న డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారు, పాలేరు గా ఉండే వారిని ఎంపిక చేసుకొని వారి పేరు మీద కోట్ల రూపాయల విలువైన భూములు కొనుగోలు చేశారు.


 ఇప్పుడు ఐటీ శాఖ మొత్తం కూపీ లాగితే తమ బండారం బయటపడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఐటి శాఖ మాత్రం దారిద్ర రేఖకు దిగువన ఉండే వారు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కొన్నారా అనే విషయాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు రంగంలోకి దిగడంతో అమరావతి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చూసినవారంతా భయాందోళనలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: