ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కొత్త మంత్రాన్ని ప్ర‌స్తావించారు. కర్ణాటకలోని బెంగళూరులో 107వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువశాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్‌ 52వ ర్యాంకుకు పెరుగడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విజయాలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని చెప్పారు. దేశంలోని యువశాస్త్రవేత్తలంతా ‘ఇన్నోవేట్‌ (ఆవిష్కరణ), పేటెంట్‌ (మేధో హక్కులు), ప్రొడ్యూస్‌ (ఉత్పత్తి), ప్రాస్పర్‌ (వర్ధిల్లు)’ నినాదాన్ని పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ఈ నాలుగు మెట్లు సహాయపడుతాయని చెప్పారు. 

 

దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నదని, ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని ప్ర‌ధాని మోదీ సూచించారు. ఇందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అన్ని రకాల అడ్డంకులను తొలిగిస్తుందన్నారు.ఇన్నోవేట్‌, పేటెంట్‌, ప్రొడ్యూస్‌, ప్రాస్పర్‌ (ఐపీ3) అనేది తన నినాదమని చెప్పారు. ‘మీరు పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు చేస్తే వాటికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అవి ఉత్పత్తులుగా మారి, ప్రజల వద్దకు చేరేలా సహకరిస్తాం. తద్వారా వాటి ఫలితాలను ప్రజలు అనుభవించగలుగుతారు’ అని పేర్కొన్నారు.

 

యువశాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌కు సమర్థవంతమైన, చవకైన ప్రత్యామ్నాయం కనుగొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు తాము చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. 2022నాటికి శిలాజ ఇంధనాల దిగుమతులను పది శాతం మేర తగ్గించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ క్రమంలో ఏర్పడే ఖాళీని ఇథనాల్‌, జీవ ఇంధనాలతో భర్తీచేయాలని, దీనిని స్టార్టప్‌లు అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా ఆవిష్కరణలు జరుగాలని సూచించారు. ‘రైతులు తమ పొలాల్లోని కొయ్యకాళ్లను తగలబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టలేమా? వాతావరణం ప్రభావితం కాకుండా ఇటుక బట్టీలను రీడిజైన్‌ చెయ్యలేమా?’ అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ శుద్ధజలం అందించేందుకు మార్గాలు అన్వేషించాలన్నారు. అంతరిక్షంలో సాధించిన విజయాల స్ఫూర్తిగా సముద్రగర్భంలోనూ భారత జెండా ఎగురవేయాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: