అమరావతిలోనే రాజధానిని కంటిన్యు అవటానికి రాష్ట్రవ్యాప్త పోరాటాలు చేయాలని చంద్రబాబునాయుడు బతిమలాడుకుంటున్నారు. విద్యార్ధులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్ధులు పోరాటంలోకి దిగకపోతే న్టపోతారంటూ బ్లాక్ మెయిల్ చేయటం గమనార్హం.  జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలోని ఓ నాలుగైదు గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

 

ఈ ఆందోళనలను చంద్రబాబు అండ్ కో దగ్గరుండి మరీ ఉధృతం చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనబడలేదు.  ఆందోళనల విషయంలో  చంద్రబాబు, టిడిపి నేతలు దగ్గరుండి మరీ ఆందోళనలను చేయిస్తుండటంతో  జరుగుతున్నదంతా పెయిడ్ ఆందోళనలు, పెయిడ్ ఆర్టిస్టులనే ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. దాంతో చంద్రబాబులో పునరాలోచన వచ్చినట్లు తెలుస్తోంది.

 

 అమరావతిపై తాము మాత్రమే పోరాటాలు చేస్తే ఉపయోగం ఉండదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. పనిలో పనిగా భార్య భువనేశ్వరిని రంగంలోకి దింపి సెంటిమెంటు రంగరిద్దామని ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. దాంతో వేరే దారిలేక  చివరకు విద్యార్ధి సంఘాల నేతలతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో  పాత పురాణాన్నే వినిపించారులేండి.

 

హైదరాబాద్ ను తాను ఎలా కట్టింది, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలను తేవటానికి ఎంతగా కష్టపడింది చెప్పుకున్నారు. సంబంధం లేకపోయినా శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తన వల్లే సాధ్యమైందని చెప్పుకున్నారు.

 

తాను ఎప్పుడు కష్టపడినా భవిష్యత్తరాల కోసమే కానీ తన కోసం ఎంతమాత్రం కాదంటూ విద్యార్ధులతో  చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఎంతసేపు తన గురించి తాను డప్పుకొట్టుకోవటమే సరిపోతోంది. తాను పోరాటం చేస్తే సరిపోదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే విద్యార్ధులంతా పోరాటాలు చేయాలని రెచ్చగొడుతున్నారు.

 

అధికారంలో ఉన్నపుడేమో ప్రత్యేకహోదా కోసం ఉద్యమం అన్న విద్యార్ధులపై కేసులు పెట్టించారు. ప్రతిపక్షంలోకి రాగానే అదే విద్యార్ధులను పోరాటాలు చేయాలని రెచ్చ గొడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలోకి వచ్చినా తన మాటే నెగ్గాలన్న మనస్తత్వం చంద్రబాబు స్ధాయిని ఎంతగా దిగజార్చేసిందో అర్ధమైపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: