జగన్ తెలివిగా నిర్ణయం తీసుకున్నాడో లేక తమ ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టాలని నిర్ణయం తీసుకున్నాడో  తెలియదు గాని ఏపీలో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. తమకు అమరావతి ప్రాంతంలో వ్యతిరేకత వచ్చినా ఫర్వాలేదు, మిగతా ప్రాంతాల్లో ప్రజల మద్దతు మరింతగా పెరుగుతుంది అనే ఆలోచనతో సీఎం జగన్ కర్నూలు, విశాఖ లను రాజధానులుగా ప్రకటించి అమరావతి కూడా రాజధానిగా ఉంటుందంటూ చెప్పారు. దీనిపై ఇప్పటికే రెండు కమిటీలు తమ నివేదికను ప్రభుత్వానికి అందించగా, హైపవర్ కమిటీ నివేదిక మరికొద్ది రోజుల్లో బయటకు రానుంది. ఇదిలా ఉంటే జగన్ నిర్ణయం కారణంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ పార్టీలోని నాయకులు మూడు ప్రాంతాల వారీగా విడిపోవడం, జగన్ నిర్ణయానికి జై కొడుతూ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉండడంతో ఆత్మరక్షణలో పడ్డారు. 


టిడిపి అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు అంటూ  బయటకు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ అమరావతిలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ మాత్రం ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దాంట్లో ఇంకా క్లారిటీ తెచ్చుకో లేకపోతుంది. మొదట్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ నిర్ణయానికి మద్దతు ఇస్తూ మూడు రాజధానుల ప్రకటన వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మరింతగా ఏపీ ముందుకు వెళుతుంది అంటూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత అమరావతి ప్రాంతంలో బిజెపి,  కన్నా వ్యవహారంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ఆయన రాజధాని రైతుల కు మద్దతుగా గంటపాటు మౌనదీక్ష చేసి తాను జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా అంటూ చెప్పుకున్నారు.


 ఇక బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పార్టీతో సంబంధం లేకుండా మొదటి నుంచి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఇంచు కూడా తరలించలేరు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు బినామీ పేర్లతో రాజధాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అందుకే ఆయన ఈ స్థాయిలో స్పందిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. అలాగే బీజేపీకి చెందిన మరో ముఖ్య నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు రాజధానిగా చేయడాన్ని సమర్పించారు. ఇది పార్టీ నిర్ణయం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశాఖపట్నం రాజధానిగా చేయడాన్ని తాము సమర్ధిస్తున్నానని, ఇది సరైన నిర్ణయం అంటూ జగన్ ను ప్రశంసించారు. మరో బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు రాజధానిపై కేంద్రం స్పందించాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, దీనిపైన జగన్ ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకున్న తర్వాత తమ వైఖరి ఏమిటో చెబుతాను అంటూ ప్రకటించారు.


ఇలా బీజేపీ ఏపీ నాయకులు ఎవరికి వారు విభిన్న వాదనలు వినిపిస్తూ పార్టీ నిర్ణయం ఏమిటో ప్రకటించకుండా కార్యకర్తలను  గందరగోళ పరిస్థితులోకి నెడుతునాన్రు. ఈ విధంగా ముందుకు వెళ్తే పార్టీ భవిష్యత్తులోనూ ఎదిగే అవకాశం కోల్పోతుందని, కష్టమైన లాభం అయినా ఏదో ఒక ఒక స్పష్టమైన నిర్ణయం తో ముందుకు వెళితే మంచిదనే  అభిప్రాయం బిజెపి కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: