జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సొంత ఎంఎల్ఏనే పెద్ద షాక్ ఇచ్చాడు. రాజోలు ఎంల్ఏ  రాపాక వరప్రసాద్ కొట్టిన దెబ్బకు  పవన్ మైండ్ బ్లాంక్ అయిపోయినట్లే ఉంది.  జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు రాపాక జై కొట్టారు. ఒకవైపు అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని పవన్ డిమాండ్ చేస్తుంటే అదే పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక మాత్రం జగన్ ప్రతిపాదనకు జై కొట్టారు.

 

పైగా ఇదే విషయమై మాట్లాడుతూ  పవన్ నిర్ణయం పవన్ దే తన నర్ణయం తనదే అంటూ రాపాక తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అదే సమయంలో  జగన్ నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి సమర్ధించిన విషయాన్ని కూడా రాపాక గుర్తు చేస్తున్నారు. మూడు  రాజధానుల విషయంలో  పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు.

 

జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పవన్ విభేదిస్తున్నా తాను చేయగలిగేదేమీ లేదన్నారు. జగన్ నిర్ణయాలకు తాను మద్దతిస్తున్న కారణంగా తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని రాపాక స్పష్టం చేశారు.

 

మొదటి నుండీ పవన్ నిర్ణయంతో రాపాక విభేదిస్తునే ఉన్నారు. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టటాన్ని పవన్ ఎంత స్ధాయిలో వ్యతిరేకిస్తున్నారో అందరూ చూసిందే. అదే సమయంలో  అసెంబ్లీలో మాట్లాడుతూ రాపాక మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్ధులు ఇంగ్లీషు మీడియంలో చదవటానికి జగన్ తీసుకుంటున్న నిర్ణయం హర్షణీయమని రాపాక అభినందించారు.

 

అదే సమయంలో  పుట్టినరోజు సందర్భంగా జగన్ ఫొటోకు రాపాక పాలాభిషేకం చేశారు. రాజధానిని అమరావతి నుండి మార్చటంపై మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేసిన భూ సమీకరణకు వ్యతరేకంగా అప్పట్లో రైతులు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు వ్యతరేకించిన కారణంగానే అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతూ పవన్ కూడా రాజధాని గ్రామాల్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికి రాపాక వ్యవహారం చూస్తుంటే జనసేన నుండి ఎప్పుడెపుడు బయటపడదామా అని చూస్తున్నట్లుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: