మ‌హారాష్ట్ర సంకీర్ణ స‌ర్కారులో ముస‌లం బ‌హిర్గతం అయిపోయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంయుక్త పాలన కొనసాగుతున్న విషయం విదితమే. సీఎంగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు. స‌ర్కారు ఏర్పాటైన అనంత‌రం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్త‌మ‌వుతోంది. తాజాగా ఇది బ‌హిర్గ‌తం అయింది. శివసేన పార్టీకి చెందిన మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మ‌హారాష్ట్రలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. 

 

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌ నుంచి సేనలో చేరిన అబ్దుల్‌ సత్తార్ శివసేనకు చెందిన ఏకైక ముస్లింనేత.  కేబినెట్‌ బెర్త్‌ ఆశించిన సత్తార్‌కు సహాయ మంత్రి పదవి దక్కడంపై నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా మంత్రివర్గ విస్తరణలో త‌నకు పెద్దగా ప్రాముఖ్యంలేని శాఖను కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సత్తార్‌ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వినిపిస్తోంది.

 

అయితే, అధికార శివసేన ఆయన రాజీనామా వార్తలను ఖండించింది. సత్తార్‌ రాజీనామా లేఖ ఇంకా తమకు అందలేదని శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. ఈ విషయంపై అబ్దుల్‌తో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతారని సేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ``మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కేబినెట్‌లో ఉన్న మంత్రులకు తాము కోరుకున్న శాఖ దక్కకపోతే కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తారు. ఐతే ఇది శివసేన ప్రభుత్వం కాదని మహా వికాస్‌ అఘడీ సర్కార్‌ అని వారంతా అర్ధం చేసుకోవాలి. అబ్దుల్‌ సత్తార్‌ వేరే పార్టీ నుంచి తమ పార్టీలో చేరినప్పటికీ కేబినెట్‌లో స్థానం కల్పించాంసత్తార్‌ రాజీనామా విషయం తన వ్యక్తిగతం. ఆయన రాజీనామా చేసినంత మాత్రాన.. కేబినెట్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవు. సాధారణంగా ఒక మంత్రి రాజీనామా చేసినప్పుడు తన రాజీనామా లెటర్‌ ముఖ్యమంత్రికి గానీ, గవర్నర్‌కు గానీ అందించాలి. కానీ అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామాకు సంబంధించి సీఎంఓ గానీ, రాజ్‌భవన్‌ గానీ సమాచారం లేదు. ` అని రౌత్‌ వివరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: