ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు ఆస్ట్రేలియాను విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. వందల్లో కాదు... వేలల్లో కాదు... లక్షల్లో కాదు ఏకంగా 50 కోట్ల మూగజీవాలు ఈ కార్చిచ్చుల్లో ఆహుతయ్యాయి. కాపాడేవారు లేక మంటలకు మూగజీవాలు బలైపోయాయి. అరుదైన జీవజాతులు భవిష్యత్తు తరానికి తెలీకుండా మసైపోయాయి. దాదాపు 200 సంవత్సరాల నుండి ఆస్ట్రేలియా అడవుల్లో నివాసం ఉంటున్న అరుదైన జీవజాతులు కాలి బూడిదయ్యాయి. 
 
ప్రాణవాయువైన ఆక్సిజన్ ను ఇచ్చే కోటిన్నర ఎకరాల్లో చెట్లతో కూడిన అడవి పూర్తిగా దగ్ధమైంది. కార్చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో మెల్ బోర్న్, సిడ్నీ ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. గడచిన మూడు నెలలుగా అంతకంతకూ పెరుగుతున్న కార్చిచ్చు వలన కోటిన్నర ఎకరాల అటవీ ప్రాంతం ఇప్పటికే బూడిద కాగా మంటలు ఇంకా విస్తరిస్తూనే ఉండటం పట్ల పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మంటలను ఆర్పడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చునని చేసిన ప్రకటనతో ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. ఎమర్జెన్సీ సైరన్ లు పలు ప్రాంతాలలో మోగుతూనే ఉన్నాయి. ఈస్ట్ గిప్స్ ల్యాండ్ ప్రాంతంలో కార్చిచ్చుకు భవనాలు శిథిలాలుగా మారిపోగా ప్రైమరీ స్కూల్ మంటలకు పూర్తిగా దగ్ధమైంది. 2019 సంవత్సరం అక్టోబర్ నెలలో ఇక్కడ మంటలు మొదలయ్యాయి. 
 
కార్చిచ్చు మంటలకు పదుల సంఖ్యలో మనుషులు మృతి చెందగా మరికొందరు గల్లంతవుతున్నారు. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాల ప్రజలు మంటల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పలువురు కార్చిచ్చు వలన తమ ఆవాసాలను కోల్పోయామని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మోరియా అనే పట్టణంలో నిత్యావసర వస్తువులు కొనటానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ఏ వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో అని కొన్ని ప్రాంతాల ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: