ఏసీబీ డీజీగా రవాణా శాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు నియమితులయ్యారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా సీతా రామాంజనేయులుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏసీబీ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఏసీబీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
ఏసీబీ డీజీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న విశ్వజిత్ ను బదిలీ చేసి అతని స్థానంలో సీతా రామంజనేయులును ప్రభుత్వం ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏసీబీపై రెండు రోజుల క్రితం సమీక్ష చేశారు. సీఎం జగన్ ఏసీబీ పనితీరు సంతృప్తికరంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజు నుండి రాష్ట్రంలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే సీఎం జగన్ అవినీతి గురించి ఫిర్యాదులు స్వీకరించటానికి 14400 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు. ఏసీబీకి అదనపు సిబ్బందిని ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ను మార్చటం ద్వారా సీఎం ఏసీబీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ సీతా రామాంజనేయులుకు దూకుడుగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం జగన్ సూచనలు చేసినట్టు సమాచారం. 
 
ఇప్పటికే  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో పాటు డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం సీఎం జగన్ ఏసీబీలో తీసుకురావాల్సిన సంస్కరణలు, అమలు గురించి చర్చించారు.  ఏసీబీ ఇప్పటికే అవినీతి నిర్మూలన కొరకు ఐఐఎం అహ్మదాబాద్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏసీబీలో పని చేస్తున్న సిబ్బందికి ఆలసత్వం ఉండకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ ఏసీబీ సమీక్ష చేసిన రెండు రోజులకే డైరెక్టర్ జనరల్ ను మార్చటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: