ఇటీవ‌లే విడుద‌లైన రూల‌ర్ సినిమా షూటింగ్‌, దాని ప్ర‌మోష‌న‌ల్ వ‌ర్క్ బిజీ అయిపోయిన అనంత‌రం సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఒకింత త‌న సొంత కార్య‌క్ర‌మాల‌కు స‌మ‌యం కేటాయిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు ఆయ‌న స‌మ‌యం కేటాయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా సినిమా,రాజ‌కీయాలు అంశాలు ఒకింత ప‌క్క‌న‌పెట్టేసి త‌మ కుటుంబానికి చెందిన ముఖ్య‌మైన సేవా కార్య‌క్ర‌మం వైపు బాల‌య్య దృష్టిసారించారు. తాను చైర్మ‌న్‌గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు ద్వారా తాజాగా ఓ కీల‌క నియామ‌కం చేశారు. ఇందులో ఓ టీఆర్ఎస్ ఎంపీ కూడా పాల్గొన్నారు.

 

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యుడిగా డా. రాఘవరావు పోలవరపును నియమించారు. సంస్థ స్థాపనలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజనేషన్, అమెరికా సంస్థకు అధ్యక్షునిగా నియమితులైన డా. రాఘవరావు పోలవరపు ఇటీవలే మరణించిన ట్రస్టు బోర్డు సభ్యురాలు డా. తులసీదేవి పోలవరపు జీవిత భాగస్వామి. స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు అందుకొని  న్యూయార్క్ లో వైద్యుడిగా స్థిరపడిన డా. రాఘవరావు దంపతులు అమెరికాలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ ను స్థాపించి హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు అవసరమైన నిధులు సేకరణలో కీలక భూమిక పోషించారు. 

 

కాగా, తదనంతరం సంస్థ ట్రస్టు బోర్డు సభ్యుడిగా కొనసాగిన డా. తులసీ దేవి నేతృత్వంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనేషన్ సంస్థకు వివిధ రూపాల‌లలో నిధుల సహాయాన్ని అందిస్తూ హాస్పిటల్ నేడు భారతదేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ఎంతో దోహదపడ్డారు. ఇలా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరిస్తున్న డా. తులసీదేవి మరణానంతరం ఆ స్థానాన్ని డా. రాఘవరావు పోలవరపుతోనే భర్తీ చేయాలని భావించిన సంస్థ ట్రస్టు బోర్డు నేడు డా. రాఘవరావు పోలవరపు నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది.  దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని ట్రస్టు బోర్డు సభ్యులు నామా నాగేశ్వర రావు, జెయస్ఆర్ ప్రసాద్, భరత్ మితుకుమల్లి సమక్షంలో ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అందించి డా. రాఘవరావు పోలవరపు ను అభినందించారు.  కాగా, టీఆర్ఎస్ ఎంపీ అయిన నామా నాగేశ్వ‌ర రావు ఇప్ప‌టికీ ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యులుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: