సోనియాగాంధీ చేసిన తప్పు తాను చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారా?, అందుకే కుమారుడ్ని ముఖ్యమంత్రి పీఠం పై కూర్చబెట్టేందుకు ఆరాటపడుతున్నారా?? అంటే అవుననే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అంటున్నారు . గతం లో రాహుల్ ను కాదని , మన్మోహన్ ను  ప్రధాని చేసినందుకు సోనియా ఇప్పుడు బాధపడుతున్నారని, రాహుల్ ను ప్రధాని చేసి ఉంటే మాజీ ప్రధానిగా మిగిలి ఉండేవారని ఆమె భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు .  ఇప్పుడు కేసీఆర్, సోనియా చేసిన తప్పు తాను చేయవద్దని అనుకుంటున్నారని , అందుకే మున్సిపోల్స్ తరువాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని లక్ష్మణ్ అన్నారు .

 

భవిష్యత్తు లో టీఆరెస్ గెలిచే దాఖలాలు లేకపోవడం తో , కుమారుడ్ని ఇప్పుడే సీఎం చేయాలని అనుకుంటున్నారని చెప్పారు . పదవుల పాకులాటే తప్ప , అభివృద్ధి గురించి టీఆరెస్ నాయకత్వానికి  ఆరాటం లేదని విమర్శించారు . మరో పదేళ్ల వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ చెప్పిన మరుసటి రోజే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవికి  కేటీఆర్ అన్ని విధాలుగా అర్హుడని వ్యాఖ్యానించడం హాట్ టాఫిక్ గా మారింది . ఒక్క ఎర్రబెల్లి కాకుండా పలువురు మంత్రులు , పార్టీ నేతలు తరుచూ కేటీఆర్  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని కానీ అదెప్పుడన్నది తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పుకొస్తున్నారు .

 

దీనితో  తెలంగాణ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి . ఇదే అంశం పై  జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించగా ,  ఇప్పుడు బీజేపీ నాయకత్వం కూడా తెలంగాణ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని వ్యాఖ్యలు చేస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది . మున్సిపోల్స్ తరువాత కేటీఆర్ కు నిజంగానే కేసీఆర్ సీఎం పదవి కట్టబెట్టనున్నారా ? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: