ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకటైన గౌతమ్ అదానీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి స‌న్నిహితుడ‌నే పేరున్న సంగ‌తి తెలిసిందే.  అదానీ గ్రూపునకు చెందిన ఓడరేవుల అభివృద్ధి సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీసెజ్)..కృష్ణపట్నం పోర్టు కంపెనీ(కేపీసీఎల్)లో 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో జరుగనున్న ఈ ఒప్పందం విలువ రూ.13,500 కోట్లు. కృష్ణపట్నం నికర విలువ రూ. 13,572 కోట్లుగా ఉన్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

 


ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవును కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్) నిర్వ‌హిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన నవయుగ గ్రూపు ఈ కేపీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. 2008లో ప్రారంభమైన ఈ కేపీసీఎల్..6800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 41 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కొద్దికాలం క్రితం కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్)లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరిగినట్లు పోర్ట్ ప్రమోటర్లకు చెందిన దగ్గరి వ్యక్తుల ద్వారా ఈ సమాచారం బయటకు పొక్కింది.  తాజాగా మేర‌కు అధికారిక స‌మాచారం వెలువ‌డింది. ఒప్పందం విలువ రూ.5,500 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా వెలువ‌డిన‌ప్ప‌టికీ....రూ.13,500 కోట్లు కేటాయించి 75శాతం వాటా కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న చింతా శశిధర్‌కు 25 శాతం వాటాతో అదే స్థానంలో కొనసాగే అవకాశాలున్నాయి.

 

కాగా, కృష్ణపట్నం నికర విలువ రూ. 13,572 కోట్లుగా ఉన్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ రేవులో అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో 75 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించిన అదానీ గ్రూపు..మార్కెట్ వాటా కూడా 27 శాతంతోపాటు వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించినట్లు అవుతున్నదని కంపెనీ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణాదిలో ఏర్పాటు చేసిన ఈ ఓడరేవు ప్రస్తుత సామర్థ్యం 54 ఎంఎంటీలు. వచ్చే ఏడేళ్ల కాలంలో ఈ సామర్థ్యాన్ని 100 ఎంఎంటీలకు పెంచాలని లక్ష్యం గా నిర్దేశించుకుంది. 2018-19లో కంపెనీ టర్నోవర్ రూ.2,394 కోట్లుగా నమోదైంది. నియంత్రణ మండళ్లు అనుమతించిన 120 రోజుల్లోనే ఈ ఒప్పందం ముగియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: