మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్క మున్సిపాలిటీ చేజారిన అమాత్యులకు మూడినట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికల నేపధ్యం లో ఇద్దరు మంత్రులు మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు  . రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపోల్స్  నేపధ్యం లో హైదరాబాద్ నుంచి కేబినెట్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ ల బెర్త్ లకు ప్రస్తుతానికి వచ్చిన సమస్య ఏమి లేనట్టేనని తెలుస్తోంది . ఎందుకంటే హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికలకు లేకపోవడంతో , ముఖ్యమంత్రి , తన మంత్రివర్గ సహచరులకు ఇచ్చిన వార్నింగ్ ఈ ఇద్దరు మంత్రులకు మాత్రం వర్తించే అవకాశాలు కన్పించడం లేదు .

 

 అయితే మిగతా మంత్రులకు సొంత నియోజకవర్గం తో పాటు , జిల్లాల్లో మున్సిపోల్స్ రూపం లో కొత్త కష్టం వచ్చి పడింది .   రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి ఖరాఖండిగా తేల్చి చెప్పారు . ఒకవేళ ఓడిపోతే మంత్రుల్ని ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు . రాష్ట్రం లో 120 మున్సిపాలిటీలు , పది కార్పొరేషన్లకు ఈ నెలాఖరులో ఎన్నికలు జరగనున్నాయి . మున్సిపాలిటీల్లో, కార్పొరేషనలలో   గెలుపు తమదేనన్న కేసీఆర్ , సర్వేలన్నీతమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు .

 

సర్వేలన్నీ తమకే అనుకూలమని, అన్ని మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో గెలుపు ఖాయమన్న  కేసీఆర్ , మరి మంత్రులకు గెలుపు బాధ్యతలు ఎందుకు అప్పగించినట్లన్న ప్రశ్న తలెత్తుతోంది  . లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలే, మున్సిపల్ ఎన్నికల్లో పునరావృత్తమైతే తమ ఉనికికే ప్రమాదమని భావిస్తోన్న కేసీఆర్ , మున్సిపోల్స్ గెలుపు బాధ్యతలను అమాత్యులకు అప్పగించారన్న వాదనలు విన్పిస్తున్నాయి . లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచారని భావిస్తోన్న ఆయన , ఒక్కసారి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత వెన్నుపోటు రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరిక చేశారు . అంటే పార్టీ నేతలు ఈ తరహా రాజకీయాల్ని చేస్తారని ముందే కేసీఆర్ అనుమానించినట్లు స్పష్టమవుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: