ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని హీరో శివాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. మూడు రాజధానులపై తనకేమీ ఆశ్చర్యం అనిపించలేదని అన్నారు. ఎన్నికలకు ముందే జగన్, వైసీపీ నేతలు పలు టీవీ ఛానెళ్లలో రాజధాని అమరావతిలో ఉండదని చెప్పారని అన్నారు. రాజకీయ పార్టీలు కులాలపై వ్యాపారం చేస్తున్నాయని శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎన్నికలకు ముందే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నాడని శివాజీ చెప్పారు. 
 
విశాఖలో జగన్ కు భూములు ఉన్నాయని ఆ విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఏపీలో పొలిటికల్ ఫ్యాక్షన్ నడుస్తోందని అన్నారు. అమరావతిలో కొత్తగా నిర్మించాల్సినవి ఏమీ లేవనీ భవనాలన్నీ దాదాపు పూర్తయ్యాయని ప్రజలు ఎప్పుడు కళ్లు తెరుస్తారని శివాజీ ప్రశ్నించారు. జగన్ పాలనను విశాఖకు షిఫ్ట్ చేయడం ఖాయమని శివాజీ అన్నారు. బోస్టన్ కమిటీ నివేదిక జగన్ చెప్పినట్టే ఉందని అన్నారు. 
 
ప్రతేకహోదాను అందరూ వదిలేశారని ప్రత్యేక హోదాను గాలికి వదిలేసి పవన్ బీజేపీ పార్టీని పొగుడుతున్నారని శివాజీ అన్నారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బును సంపాదించుకోవటానికే రాజధానిని మారుస్తున్నారని అన్నారు. జగన్ తన రాజకీయ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ఏపీ భవిష్యత్ ప్రమాదంలో పడిపోయిందని చెప్పారు. వాలంటీర్ల ఉద్యోగాలు వైసీపీ పార్టీ వాళ్లకే ఇచ్చామని విజయసాయిరెడ్డి చెప్పారని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా...? అని ప్రశ్నించారు. 
 
శివాజీ హీరోగా కంటే గత ఎన్నికలకు ముందు కేంద్రం ఆపరేషన్ గరుడ పేరుతో కొత్త కుట్రలు చేస్తోందని చెబుతూ గరుడ పురాణం శివాజీగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత టీవీ9 ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కుని రెండు తెలుగు రాష్ట్రాలలో అభాసుపాలయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా శివాజీ చంద్రబాబు డైరెక్షన్ లో గరుడ పురాణం చెప్పాడని విమర్శలు కూడా వినిపించాయి. టీవీ9 వివాదంలో చిక్కుకున్న శివాజీ అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన క్రమంలో దొరికిపోయి అభాసుపాలయ్యారు. కొంతకాలం నుండి మీడియాలో పెద్దగా కనిపించని శివాజీ మరోమారు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: