మేం జర్నలిస్టులం.. పత్రికాస్వేచ్ఛ మా హక్కు. మేం ఏదైనా రాస్తాం.. ఎలాంటి విశ్లేషణ అయినా చేస్తాం.. ఎదుటి వ్యక్తిపై ఎంత బురదైనా వేస్తాం.. కావాలంటే టార్గెట్ చేసి మరీ రాస్తాం.. కానీ మా జోలికి మాత్రం ఎవరూ రావద్దు. మా పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉంది. వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఆర్టికల్ 19 మాకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చింది.. ఇదీ ఇటీవలి కాలంలో కొన్ని మీడియా సంస్థల తీరు.

 

ఇంకా ఏమైనా అంటే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందని గగ్గోలు పెడతాయి. ప్రభుత్వాలు పత్రికలను, మీడియాను అణగదొక్కుతున్నాయని రాద్ధాంతం చేస్తాయి. వాస్తవానికి మీడియా స్వేచ్ఛ చాలా అవసరం.. ప్రపంచంలోనే శక్తివంతమైన నేతల్లో ఒకడుగా ఉన్న నెపోలియన్ తాను కోటి మంది సైన్యం కంటే.. ఒక పత్రికకు ఎక్కువగా భయపడతాను అన్నాడు.

 

వాస్తవానికి పత్రికల స్థాయి అది. పత్రికల దమ్ము అది. కానీ ఆ దమ్ము, ధైర్యాలను పత్రికాస్వేచ్ఛను పత్రికలే దుర్వినియోగం చేస్తే.. రాజకీయ పక్షపాతంతో, ఆశ్రిత పక్షపాతంతో అక్షరాలను అమ్ముకుంటే.. జనం మెదళ్లను కలుషితం చేసేందుకు ఉపయోగిస్తే.. దీన్ని అడ్డుకునే అవకాశం లేదా.. పత్రికాస్వేచ్ఛ ముసుగులో ఇలాంటి కలం వీరులను గాలికి వదిలేయాల్సిందేనా.. ఇప్పుడు మీడియా సర్కిళ్లలో జనబాహుళ్యంలో చర్చ జరగాల్సిన అంశమిది.

 

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం పత్రికలపై కేసులు పెట్టే అధికారం అధికారులకు కల్పిస్తూ ఓ జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తెలుగులో మీడియా పక్షపాత రహితంగా లేదన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం పత్రికలకూ తెలుసు. వాటిని చదివే పాఠకులకూ తెలుసు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే.. మీకూ కొన్ని పత్రికలు ఉన్నాయి.. మాకూ కొన్ని పత్రికలు ఉన్నాయి.. అనేంతటి పరిస్థితి.

 

కొన్ని అగ్రశ్రేణి తెలుగు పత్రికలు.. ఏ పార్టీకి కొమ్ముకాస్తాయో.. ఏ పార్టీకి భజన చేస్తాయో.. ఎవరిటి టార్గెట్ చేస్తాయో అందరికీ తెలిసిందే. మరి పత్రికలు తాము నీతి తప్పి అక్షరాలు అమ్ముకుంటున్నప్పుడు ఒకరికి కొమ్ము కాస్తున్నప్పుడు.. ఇక పత్రికాస్వేచ్ఛ అని అరిచే స్వేచ్ఛ ఉంటుందా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: