ఎముకలు కొరికే చలిలోనూ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార పార్టీ ఆప్‌.. విపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. దీనికి బీజేపీ ప్రతిగా కౌంటర్ ఇస్తోంది. అయితే తాజాగా ఢిల్లీలోని కాలనీల్లో అక్రమంగా కొందరు నివసిస్తున్నారంటూ కేంద్రమంత్రి.. గవర్నర్ ను కలవడంతో.. వాడివేడి ట్వీట్లు వండివారుస్తున్నారు. 

 

దేశరాజధాని ఢిల్లీని ఎలక్షన్ ఫీవర్ ఊపేస్తోంది. అధికార, విపక్షాలు... ప్రజామద్దతు సమీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అచ్చే బాతే 5 శాల్.. లగే రహో కేజ్రీవాల్ అంటూ ఆప్ ప్రచారాన్ని సాగిస్తోంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌పై ఎవరు బరిలో దిగుతారంటూ ఆప్ చేసిన ట్వీట్‌... బీజేపీని ఇరకాటంలో పడేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు దిగుతారనేది .. బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ... పార్టీ నేతలు తెలిపారు. దీనికి తోడు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సాయంతో.. మరోసారి ఢిల్లీ గద్దెను దక్కించుకుంటామని ఆప్ విశ్వసిస్తోంది.

 

కేంద్రమంత్రి హర్ దీప్ పురీ.. 20 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకొని.. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కలవడం .. రాజకీయంగా కాక రేపింది. సూరజ్ పార్క్, రాజ్ విహార్ ప్రాంతాల్లోని అనధికార కాలనీల్లో 20 మంది ఉంటున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆప్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇలాంటి కాలనీల్లో 40 లక్షల మంది నివసిస్తున్నారని.. ఏవో 20పేర్లు తీసుకొని రాజకీయం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి సిసోడియా మండిపడ్డారు. అవి ఫేక్ పత్రాలని ట్వీట్ చేశారు. పురీ తీరుపై ఢిల్లీసీఎం కేజ్రీవాల్ సైతం ట్వీట్ చేశారు. పంట భూముల్లో క్రమబద్దీకరణ కాని కాలనీల్లో లక్షలమంది నివసిస్తున్నారని.. ఇప్పుడు వారి ఇళ్లను క్రమబద్దీకరిస్తారా అని ప్రశ్నించారు. అసవసరంగా డ్రామాలాడొద్దన్నారు. 

 

పూర్వాంచల్, పంజాబ్, ముస్లిం  కమ్యూనిటీ ప్రజలు...ఢిల్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. బీహార్, జార్కండ్ నుంచి వచ్చిన జనం.. 25 శాతం వరకూ ఉన్నట్లు అధికార అంచనా. పూర్వాంచల్ నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు.. 25శాతం సీట్లలో ప్రభావం చూపనున్నారు. ఇక ఢిల్లీలో ఉన్న 35 శాతం పంజాబీ ఓటర్లు.. 30 సీట్లలో ఫలితాన్ని మార్చగలరు. దీంతో 1984 సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పూర్వాంచల్ ఓటర్లకోసం పురీ, మనోజ్ తివారీ లాంటి నేతలను వినియోగిస్తుండగా.. ఆప్ ముస్లిం , బడుగుల ఓట్లపై కన్నేసింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: