ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసిం సులేమానీ మ‌ర‌ణం..యుద్ధ‌మేఘాలు క‌మ్ముకునేలా చేస్తోంది. ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ద‌ళానికి చెందిన అధిప‌తి జ‌న‌ర‌ల్ ఖాసిమ్ సులేమానిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. బ‌గ్దాద్ విమానాశ్ర‌య స‌మీపంలో కారులో వెళ్తున్న సొలేమ‌నిపై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి చేశాయి. ఈ ఉద‌యం జ‌రిగిన దాడిలో సులేమాని ప్రాణాలు కోల్పోయాడు. దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర‌కే సులేమానిని హ‌త‌మార్చిన‌ట్లు ఇవాళ పెంట‌గాన్ వెల్ల‌డించింది. అయితే, సులేమానీని హతమార్చడం వల్ల మధ్యప్రాచ్యంలో మరో యుద్ధమేమీ రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను తీసి సులేమానీ రాక్షసానందం పొందేవాడన్నారు.

 

ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. రు. సులేమానీతో భారత్‌కు సైతం ముప్పు పొంచి ఉన్నదని, అతడు ఢిల్లీతోపాటు లండన్‌లోనూ ఉగ్రవాద కుట్రలకు, దాడులకు సహకారం అందించాడని చెప్పారు. సులేమానీ గత 20 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తూ మధ్యప్రాచ్యంలో అస్థిరతకు కారణమయ్యాడని ఆరోపించారు. గత నెల ఇరాక్‌లోని అమెరికా సైనికులపై జరిగిన రాకెట్‌దాడి, బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద హింస తదితర ఘటనలు సులేమానీ పర్యవేక్షణలోనే జరిగాయన్నారు. సులేమానీ హత్యతో బాధితులందరికీ న్యాయం జరిగిందని, అతడిని గతంలోనే హతమార్చి ఉంటే ఎంతోమంది ప్రాణాలు నిలిచేవని చెప్పారు.

 


సులేమానీ హత్య ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ధానికి దారితీస్తుందన్న వాదనలను ట్రంప్‌ కొట్టిపారేశారు. పైగా యుద్ధాన్ని ఆపేందుకే తాము సైనిక చర్య జరిపామని చెప్పారు. ‘ఒక యుద్ధాన్ని ఆపడానికే మేము దాడి చేశాం. అంతేగాని యుద్ధాన్ని మొదలుపెట్టడానికి కాదు. ఇరాన్‌ ప్రజల పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నది. వారు అపార వారసత్వ సంపద, అపరిమిత శక్తిసామర్థ్యాలు ఉన్న గొప్ప వ్యక్తులు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, దేశానికి ఆర్థికంగా నష్టం చేస్తున్నవారిని ఇరాన్‌ ప్రజలు ఎన్నటికీ క్షమించరు’ అని పేర్కొన్నారు. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచన తమకు లేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: