ఇరాక్ విమానాశ్రయంలో అమెరికా మిస్సైల్ దాడి ప్రభావం.. భారత ఆర్థికవ్యవస్థపైనా పడనుందా? అంతర్జాతీయ మార్కెట్ లో పెరగనున్న ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేస్తాయా? ఫారిన్ ఇన్వెస్టర్స్.. తమ సంపదను వెనక్కు తీసుకునే అవకాశముందా..? భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుంది?..వచ్చే నెలలో రానున్న కేంద్ర బడ్జెట్‌పై దీని ప్రభావం ఎంత ఉండబోతుందనే చర్చ మొదలైంది. 

 

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా మిస్సైల్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సోలెమని మృతి చెందడం.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతను రాజేసింది. ప్రధానంగా ఈపరిణామం ముడిచమురు మార్కెట్‌ను మండిస్తోంది. దాడి జరగడానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ ముడిచమురు ధర 68 డాలర్లుగా  ఉంది.  2019 సెప్టెంబర్ నుంచి ఈ ధర కొనసాగుతోంది.అయితే దాడుల అనంతరం 70 డాలర్లకు చేరింది. సహజంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి అభివృద్ధిచెందుతున్న దేశాలకు... ఇది శాపంలా మారనుంది

 

భారత్ ముడిచమురు దిగుమతుల్లో .. 80శాతం ఇక్కడి నుంచే వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడంతో.. దాని భారం భారత ఆర్థికవ్యవస్థపైనా పడనుంది.  ఫలితంగా ఎక్సైజ్ డ్యూటీలు, రిటైల్ ఆయిల్ ధరలు తగ్గించాలని ఒత్తిడి వచ్చే ప్రమాదముంది. రెవెన్యూ తగ్గిపోయే పరిస్థితులు భారత ద్రవ్యలోటుపైనా ప్రభావం చూపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

 

2019-20వ సంవత్సరానికిగానూ భారత్ ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంది. టాక్స్ వసూళ్లు తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరే అవకాశం లేకపోవడంతో.. మరిన్ని సమస్యలు తప్పదని తెలుస్తోంది.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం...పెట్రోల్‌పై 21 రూపాయలు, డీజిల్‌పై 16రూపాయలు వసూలు చేస్తోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 75 రూపాయలు, డీజిల్ 68 రూపాయలు పలుకుతోంది.  2019 సెప్టెంబర్‌లో కేర్ రేటింగ్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం.. దాదాపు 3 లక్షల కోట్లను పెట్రోలియం సెక్టార్ నుంచి రాబట్టగా..అందులో 2 లక్షల 15 వేల కోట్లు కేవలం ఎక్సైజ్ డ్యూటీగానే వచ్చింది. 

 

మరోవైపు విదేశీ ద్రవ్యమార్కెట్‌లో డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ 40పైసలు క్షీణించింది. ప్రస్తుత సంక్షోభం కారణంగా రూపాయి విలువ మరింతగా క్షీణించే పరిస్థితులు ఉండడంతో.. విదేశీ ఇన్వెస్టర్లు.. ఫారిన్ మనీని .. తిరిగివెనక్కు తీసుకునే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఇతర సురక్షితమైన బిజినెస్‌లలో పెట్టే పరిస్థితి ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: