తెలుగుదేశం పార్టీలో ఉండగా సాధినేని యామిని శర్మ హవా మామూలుగా ఉండేది కాదు. పార్టీ తరఫున ఆమె బలంగా వాదన వినిపిస్తూ నిత్యం మీడియా డిబేట్లలో హల్చల్ చేస్తూ అతికొద్ది సమయంలోనే మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆమె పనితీరుకు చంద్రబాబు ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టారు. ఇక ఆమె మరింతగా పార్టీ కోసం కష్టపడుతూ ముందుకు వెళ్లారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఆమెకు టికెట్ దక్కలేదు. అయినా ఆ బాధను దిగమింగుకుని పార్టీలోనే ఉంటూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ దీనమైన స్థితికి చేరుకోవడంతో పాటు అధికార పార్టీ నుంచి తనకు వేధింపులు ఉంటాయనే ఆందోళనతో ఆమె గతేడాది నవంబర్ లో రాజీనామా చేశారు.


 ఇక అప్పటి నుంచి ఆమె బిజెపిలో చేరేందుకు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ ప్రతి సందర్భంలోనూ ఆమె చేరికకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. తాజాగా ఆమె కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బిజెపిలో చేరారు. ఆమెతోపాటు కడప జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరులు కొంతమంది బీజేపీలో చేరారు. అయితే ఆమె నెల రోజులుగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా ఆమెకు ఆ పార్టీలో చేరే అవకాశం దక్కలేదు.


 బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీ పర్యటన సమయంలో ఆయన సమక్షంలో ఆమె పార్టీలో చేరాలని చూశారు. కానీ అకస్మాత్తుగా ఆయన పర్యటన రద్దు అయ్యింది. ఆ తర్వాత ఢిల్లీలో ఇతర నాయకులతో కలిసి బీజేపీలో చేరాలని చూసినా అదీ సాధ్యం కాలేదు. చివరికి కడప జిల్లాలో కేంద్ర మంత్రి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఇన్ని ట్విస్టుల మధ్య పార్టీలో చేరిన ఆమెకు బిజెపిలో అనుకున్న స్థాయిలో పదవులు, ప్రాధాన్యం అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. ఏపీలో టీడీపీ కి భవిష్యత్తు ఉండదు అనే కారణంతోనే ఆమె బీజేపీలోకి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఇక బీజేపీలో ఆమె రాజకీయ ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: