మహారాష్ట్రలోని కాంగ్రెస్‌-శివ‌సేన‌-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. అవి బ‌హిర్గ‌తం కూడా అవుతున్నాయి. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 30న 36 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో శివసేన నేత అబ్దుల్‌ సత్తార్‌ తనకు కేటాయించిన సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సోమవారం నాటి క్యాబినెట్‌ విస్తరణలో ఆయనకు సహాయ మంత్రి పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి శివసేనలో చేరిన సత్తార్‌, క్యాబినెట్‌ మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. సత్తార్‌ రాజీనామా తమకు అందిందని, పార్టీ దీనిని పరిశీలిస్తున్నదని శివసేన సీనియర్‌ నేత ఏక్నాథ్‌ షిండే తెలిపారు. ఇలా క‌ల‌క‌లం కొనసాగుతుండ‌గానే...మహారాష్ట్రలో మంత్రులకు శాఖలను కేటాయించారు.

 

ఎన్‌సీపీ నేత‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలు, మైనింగ్‌-మరాఠీ శాఖలు, ఏక్‌నాథ్‌ షిండేకు పట్టణాభివృద్ధిశాఖ, ఆదిత్య ఠాక్రేకు పర్యాటకం, పర్యావరణం, ప్రోటోకాల్‌ శాఖలు, బాలాసాహెబ్‌ థోరట్‌కు రెవెన్యూశాఖను కేటాయించారు. ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నారు.  సీఎం ఉద్దవ్‌ ఠాక్రే పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ ఆమోదం తెలిపారు.

 

సహాయ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వదంతుల గురించి మీడియా ప్రశ్నించగా స‌త్తార్ ఆస‌క్తిక‌రంగా  సమాధానమిచ్చారు. పార్టీ అధినేత, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను నేడు కలుస్తానని, ఆ తర్వాతే తన రాజీనామా గురించి వెల్లడిస్తానని తెలిపారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆయనతో ఫోన్‌లో మాట్లాడారని, ఆదివారం ముంబైకి రావాలని పిలిచారని ఉదయం సత్తార్‌ ఇంటికి వెళ్లిన పార్టీ నేత ఖోట్‌కర్‌ తెలిపారు. మరోవైపు సత్తార్‌ మోసగాడని, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఆయన మద్దతుదారులు సహకరించలేదని ఔరంగాబాద్‌కు చెందిన శివసేన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఖైరే ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: