చంద్రబాబు రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలకు తన సొంత గ్రామమైన నారావారిపల్లె కుటుంబ సమేతంగా వెళ్లడం, అక్కడ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు కుటుంబం నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం పరోక్షంగా జగన్ తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తోంది. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు దిగుతూ రైతుల మనోభావాలను దెబ్బతీస్తుందని, ఇప్పటికే అక్కడ జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక రైతు మరణించాడని, రైతులు అక్కడ బాధపడుతుంటే ఆనందంగా ఉండలేను అని అందుకే సంక్రాంతి సంబరాలతో దూరంగా ఉంటున్నా అంటూ చంద్రబాబు ప్రకటించారు. 


వాస్తవంగా ప్రతి సంవత్సరం నారావారిపల్లె గ్రామ దేవత సత్యమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతిమకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం నందమూరి, నారా కుటుంబాలు ఒకచోటకు చేరి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా చంద్రబాబు తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాదుల వద్ద నివాళులు అర్పిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అమరావతిలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తాము సంబరాలు చేసుకుంటే విమర్శలు వస్తాయని చంద్రబాబు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. 


ఇక అమరావతిలో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తూ పార్టీకి మైలేజ్ పెరిగేలా చేయాలని చూస్తున్నాడు. తన కుటుంబం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండడం వల్ల ప్రజల్లో మరింత సానుభూతి లభిస్తుందని బాబు ఆశపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఎంత రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించినా జగన్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు తమ నివేదిక ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో హైపవర్ కమిటీ మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకున్న తరువాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: