ఇరానియన్ జనరల్ ఖాసింను మిస్సైల్ దాడితో అమెరికా అంతమొందించడంతో.. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. సాక్షాత్తూ మిలటరీ జనరల్‌ను .. అమెరికా మట్టుబెట్టడంపై ఇరాన్ రగిలిపోతోంది. మరోవైపు.. అమెరికా, ఇరాన్ దేశాలు సంయమనం పాటించాలని ఇండియా విజ్ఞప్తిచేసింది. 

 

బాగ్ధాద్ ఎయిర్ పో్ర్టులో ఇరానియన్ జనరల్ ఖాసిం, అతని సలహాదారుడిని అమెరికా మిస్సైల్ దాడితో హతమార్చడం .. అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఖాసిం అక్కడకు వెళ్తున్నారన్న ఖచ్చితమైన సమాచారాన్ని అందుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో హతమార్చినట్లు అమెరికా రక్షణ విభాగం స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ తీవ్రంగా స్పందించారు. తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇది ఫూలిష్ చర్యన్న ఇరాన్ విదేశాంగమంత్రి జరీఫ్.. ప్రమాదకరమైన విన్యాసమని అన్నారు. మరోవైపు ఈ ఎటాక్‌పై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్.. భిన్నంగా స్పందించారు. ఈ ఎటాక్.. ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. దీనివల్ల ఇరాన్‌ జాతీయతా భావం పెరిగి.. ప్రభుత్వానికి మద్దతు మరింతగా పెరుగుతుందన్నారు.

 

ఇరానియన్ మిలిటరీ జనరల్ ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని భారత్ విజ్ఞప్తిచేసింది. దీనికి ప్రధాన కారణం సౌదీలోని అర్మాకో రిఫైనరీపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసే ప్రమాదం పొంచి ఉండడం. ఇప్పటికే భారత్ 80శాతం చమురు దిగుమతులు... గల్ఫ్ దేశాల నుంచే జరుగుతోంది. ఈ క్రమంలో దాడుల కారణంగా దిగుమతులు తగ్గితే.. భారత్‌పై ఆ ప్రభావం చూపిస్తుంది. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదముంది.

 

ఇప్పటికే అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో బారెల్ ధర 3 డాలర్లు పెరిగింది. ఏక్షణాన్నైనా దాడులు జరిగి... అర్మాకో సహా పలు రిఫైనరీల నుంచి చమురు ఉత్పత్తి నిలిచిపోతే.. భారత కష్టాలు రెట్టింపవుతాయి. ఈక్రమంలో ఆ పరిస్థితి తలెత్తకూడదని భారత్ ఆశిస్తోంది. ఇటు అగ్రరాజ్యంతో ఇటీవలికాలంలో బంధాలు బలపడ్డాయి. ప్రధానంగా రక్షణ పరంగా వేలకోట్ల రూపాయల అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు భారత్ సిద్ధమైంది. మరోవైపు.. ఇరాన్ పాత మిత్రుడనే చెప్పాలి. ఈ రెండింటి మధ్య ఉద్రిక్తలు రేగడంతో... ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భారత్ దౌత్యపరంగా తన ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: