మంత్రి మాటలు ఇటు జనాన్ని.. అటు పార్టీనేతలను తికమక పెట్టేస్తున్నాయి. కాస్త సీక్రేట్ గా ఉండాల్సినవన్నీ జనంలోనే చెప్పేస్తుండటంతో అటు ప్రభుత్వానికి.. ఇటు అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల్లేక ఆగిన పనులను అధికారుల నిర్లక్ష్యంగా చిత్రీకరించడం, తమ సొంతూరికే పనులు జరగడం లేదని చెప్పడం.. చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు కూడా సమాధానం చెప్పకుండా సెటైర్లు వేయడంపై.. టీఆర్ఎస్ లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. 

 

తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష నాయకుల మాదిరిగా మాట్లాడేస్తున్నారు. జనం నిలదీస్తే సర్కార్ వద్ద పైసల్లేవని కౌంటర్లిస్తున్నారు. రివ్యూల్లో అధికారుల వల్లనే పనులేవి జరగడం లేదని మాటల తూటాలు పేలుస్తున్నారు. 

 

నిర్మల్ జిల్లాతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్బాల్లో మంత్రి ఐకే రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పెన్షన్, కళ్యాణ లక్ష్మి పైసలకోసం జనం మంత్రి నిలదీస్తే ఆవేశానికి లోనైన ఐకే రెడ్డి.. ప్రభుత్వం వద్ద ఆదాయం తగ్గిందని తర్వాత ఇస్తామని కుండబద్దలు కొట్టారు.

 

ఆ మధ్య జరిగిన సమీక్ష సమావేశంలో.. మిషన్ భగీరథ నీళ్లు తమ సొంతూరికే రావడం లేదని అధికారుల్ని నిలదీశారు మంత్రి. నిధుల లేమితో ఆగిన అంశాన్ని.. అధికారుల నిర్లక్ష్యంగా చిత్రీకరించడం అధికారుల్లో చర్చకు దారితీసింది. సీఎంఓ సెక్రేటరీ స్మిత సభర్వాల్ ఇటీవల నిర్మల్ జిల్లా పొన్కల్ కు వచ్చారు. అక్కడ పరిహారం ఇవ్వాలని జనం నిలదీస్తే...మేము డబ్బులిస్తే మీరు ఖర్చు చేస్తారని అందుకే ఇవ్వలేదని అక్కడున్న మహిళలకు ఐకే రెడ్డి సైటెర్లు వేశారు. దీంతో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

 

మంత్రి ఎక్కడ పర్యటించినా..ఏ సమీక్షలో పాల్గొన్నా...అధికారులను టార్గెట్ చేయడమే కాకుండా ప్రజల్ని కూడా వదలడం లేదు. మంత్రే నోరు జారుతుండటంతో.. మున్సిపోల్స్ లో ప్రభావం చూపుతుందేమేనని సొంత పార్టీ నేతలకు భయం పట్టుకుంది. మంత్రి ఐకే రెడ్డి వ్యాఖ్యల్ని రాజకీయ చతురత అనుకోవాలో.. ఇంకేమనుకోవాలో తెలియక గులాబీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: