సీఏఏపై ఒక్క ఇంచీ కూడా వెనక్కు తగ్గేదిలేదంటారు హోంమంత్రి అమిత్ షా... దేశవ్యాప్తంగా అవగాహన ర్యాలీలతో బీజేపీ ముందుకెళుతోంది. మరోవైపు.. సీఏఏ వ్యతిరేకంగా విపక్షాలు సైతం ఏకతాటిపైకి వస్తున్నాయి. ఈ దిశగా కేరళ సీఎం విజయన్‌.. 11 మంది సీఎంలకు లేఖ రాశారు. 

 

పౌరసత్వ సవరణ చట్టం.. ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి.  వర్సిటీల విద్యార్థులు కదన రంగంలోకి దిగారు. ప్రజాందోళనలకు విపక్షాలు తోడయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, ప్రియాంక,  డీఎంకే చీఫ్ స్టాలిన్, బెంగాల్ సీఎం మమత సహా పలువురునేతలు... తీవ్రస్థాయిలో సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. కేరళ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అంతటితో ఆగని కేరళ సీఎం విజయన్.. మిత్రపక్షాలకు చెందిన 11మంది సీఎంలకు లేఖ రాశారు. ఇందులో జేడీయూ సీఎం నితీష్‌ కుమార్ కూడా ఉన్నారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, విభిన్నతకు ఇది పరీక్ష సమయమన్నారు.

 

పౌరసత్వ సవరణ చట్టంపై బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని .. హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ అంశంపై కనీసం ఒక్క ఇంచి కూడా వెనక్కు తగ్గేది లేదన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు చేతులు కలిపినా .. మడమతిప్పమన్నారు. ఎంత ఎక్కువ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటే.. అంతగా చేసుకోవచ్చని సూచించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు.. అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు ఈ చట్టం వల్ల తమకు మేలు కలుగుతుందన్నారు. 

 

పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కేరళ  కోరుతోంది. రాజ్యంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఇప్పటికే బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు ప్రకటించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: