ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ నేత, పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకరబాబు మండిప‌డ్డారు. దళిత ఐఏఎస్ అధికారి పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. చంద్రబాబును రాజకీయాలనుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా నుంచి డిస్మిస్ చేయాలని సుధాక‌ర్ బాబు కోరారు.  దళిత సమాజానికి చంద్రబాబు పూర్తిగా దూరమైపోయారని సుధాక‌ర్ బాబు తెలిపారు. చంద్రబాబుపై గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

 


అన్ని వర్గాలను ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ సమానంగా చూస్తున్నారని సుధాక‌ర్ బాబు తెలిపారు. ``అమరావతి రైతులకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుంది. చెప్పిన మాట కోసం ఎందాకైనా వెళ్లే నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్``అని సుధాక‌ర్ బాబు తెలిపారు. అమ‌రావ‌తి త‌ర‌లిపోతుంద‌నే ప్రచారం న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. ``అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృధ్ది సాధ్యం. అమరావతిలో కొన్నిశాఖలు, హైకోర్టు బెంచ్ ఉంటాయి. కొన్ని శాఖలు మాత్రమే విశాఖకు వెళ్తాయి. ఇది నిజం. అయితే, త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎల్లోమీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు`` అని మండిప‌డ్డారు.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, అమ‌రావ‌తి విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్దని అన్నారు.`` రాజ‌ధాని విష‌యంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీలు చెప్పినా సరిపోదా?  టీడీపీ నేత‌, చంద్ర‌బాబు మ‌నిషి నారాయణ కమిటి  చెప్పిందే వేదమా?`` అని ప్ర‌శ్నించారు.  చంద్రబాబు కుటిల రాజకీయాలకు బలికావద్దని రైతుల‌ను ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు కోరారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని, అందుకే ఆయ‌న నోరు జారి విమ‌ర్శ‌లు, తప్పుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ప్రజల చేతుల్లో చావుదెబ్బ తిన్నా చంద్రబాబుకు బుధ్దిరాలేదని సుధాక‌ర్ బాబు అన్నారు. చంద్రబాబును అన్ని వర్గాల వారు ఛీ కొడుతున్నారని ఆయ‌న పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: