చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ పార్టీ నేతలే అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన రోజాను వైసీపీ పార్టీ నాయకులు అడ్డుకోవటంతో రోజాకు ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. వైసీపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రోజా వైసీపీ నాయకుల కంటే టీడీపీ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. 
 
ఎన్నికల్లో రోజా గెలుపు కోసం తాము ఎంతో కృషి చేశామని కానీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రోజా తమకు తగినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదని తమను కనీసం పట్టించుకోవటం లేదని అన్నారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను కూడా రోజా పట్టించుకోవడం లేదని వారు ఆరోపణలు చేశారు. తమను కనీసం ఎమ్మెల్యే రోజా గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి కూడా పిలవలేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. 
 
దాదాపు 15 నిమిషాల పాటు ఎమ్మెల్యే రోజా కారు ముందుకు కదలకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. రోజా వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు సర్దిచెప్పటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ వైసీపీ పార్టీ నాయకులు మాత్రం రోజా ఎంత చెప్పినా వినకుండా కారుకు అడ్డంగా నిల్చొని రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే తన మాట వినకపోవటంతో ఎమ్మెల్యే రోజా కొంత ఇబ్బంది పడ్డారు. 
 
పోలీసులు గ్రామస్థులకు సర్దిచెప్పి అక్కడినుండి పంపించివేశారు. రోజా గ్రామసచివాలయానికి ప్రారంభోత్సవం చేసి వెంటనే వెనుదిరిగారు. సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత రోజాకు కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజా నిధులు నిర్వహిసున్నారు. మరో రెండు సంవత్సరాలలో ఏర్పడే కేబినేట్ లో రోజాకు మంత్రి పదవి ఖచ్చితంగా దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తల వలన రోజాపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: