తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో గట్టిగా తన వాయిస్ వినిపిస్తే ఏం ముంచుకొస్తుందో అని భయపడుతూ ఉన్నాడు. కానీ అమరావతి విషయంలో తెలుగుదేశం బాగా యాక్ట్ అవ్వడం, అధికార పార్టీ వైసీపీ మీద తీవ్రస్థాయిలో ఉద్యమం మొదలు పెట్టడంతో కాస్త ధైర్యం తెచ్చుకున్న యనమల తాను కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాను అని నిరూపించుకునేందుకు రంగం లోకి దిగిపోయాడు. 


తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చాడు. గతంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అవగాహన కలిగించేలా మాట్లాడతారని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ఎత్తుగడలో భాగంగానే యనమల రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే  ఆయన మాట్లాడిన మాటలు మొత్తం తీవ్ర గందరగోళం, గజిబిజిగా ఉండడంతో అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఎవరికీ అర్థం కావడంలేదు. దీనిపై సొంత పార్టీ నేతలకు కూడా కామెంట్లు చేస్తున్నారు. 


ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకే సరిపోతుందని ఇక రాష్ట్ర అభివృద్ధికి, పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకు వస్తారు అంటూ యనమల డౌట్ పడుతున్నారు. అయితే యనమల ఆరోపిస్తున్న ప్రశ్నల్లో కాస్త నిజం ఉన్నా ప్రభుత్వ ఖజానా అంతా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లకే సరిపోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనేక లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. దాని వల్లే డబ్బంతా ఖర్చయిపోతోంది అనేది యనమల బాధగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో రాష్ట్ర ఖజానా మొత్తం వాటికే సరిపోతుంది అన్నట్టుగా యనమల బాధను వ్యక్తం చేస్తున్నాడు. 


ఒకవైపు టిడిపి జగన్ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఖజానా మొత్తం వాటికే  ఖర్చు చేస్తున్నారని, ఇన్ని స్కీములు పెట్టి ప్రజల కోసం ఇంతగా ఖర్చు పెడితే ఇక మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తోంది. కానీ యనమల మాత్రం దానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు అని మాట్లాడుతుండడం టిడిపిలోనూ, యనమల రామకృష్ణుడిలోనూ ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: