సీనియర్ పొలిటిషన్, అనంతపురం మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి పార్టీ  మారే ఆలోచనలో ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జెసి గత కొంతకాలంగా పార్టీ మారాలని చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఆయన జగన్ ను అదేపనిగా పొగుడుతూ వచ్చారు. కానీ ఆయనకు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో చేసింది లేక టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడం, ఇంకా అనేక వ్యాపారాలపై దాడులు నిర్వహించడం ఇతర వేధింపులకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆగ్రహంతో ఉన్నారు.


 అదీ కాకుండా తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఆయన్ను ఎనిమిది గంటలకు పైగా కూర్చోబెట్టడం ఇవన్నీ జేసీకి ఇబ్బందికరంగా మారాయి. ముందు ముందు కూడా వైసిపి తనను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందనే సమాచారంతో ఆయన కేంద్ర అధికార పార్టీ బిజెపిలో చేరాలని చూస్తున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను తాజాగా దివాకర్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా తాను బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా వ్యవహరించారు. అయితే సూటిగా మాత్రం పార్టీలో చేరుతున్నాను అనే విషయాన్ని చెప్పలేదు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశా అని చెప్తున్నారు. 

 

ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదని, జాతీయ పార్టీలతోనే అది సాధ్యమవుతుందని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్లో కలిపితే తాను ఖచ్చితంగా బీజేపీలో చేరుతాను అంటూ చమత్కరించారు. ఆయన వ్యవహారం, వ్యాఖ్యలను బట్టి చూస్తే కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి,  కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తొందర్లోనే ఆయన మంచి మూహూర్తం చూసుకుని బీజేపీలో చేరి జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ పొందాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: