తన కొ(చె)త్తపలుకులో ఆర్కె చంద్రబాబునాయుడు పరువును సాంతం తీసేశారు.  అమరావతి రాజధానికి భూములిచ్చిన గ్రామాల  రైతులు తప్ప రాష్ట్రంలో ఇంకెవరూ స్పందించటం లేదని అంగీకరించారు.  ఇదే వేమూరి మిగిలిన రోజుల్లో రాజధాని తరలింపు విషయంలో మొత్తం రాష్ట్రమంతా అగ్నిగుండమైపోతోందని రాస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమలో కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందంటూ రాసిందంతా అబద్ధమే అని తేలిపోయింది.

 

మొన్నటి ఎన్నికల్లో జగన్ కు ప్రజలు కట్టబెట్టిన అఖండ మెజారిటితోనే రాజధానిని తరలించుకుని పోయే  అధికారం ఇచ్చారని బోల్డు బాధపడ్డారు. అంటే శివరామకృష్ణన్ కమిటి వద్దని చెప్పినా వినకుండా అప్పట్లో చంద్రబాబునాయుడుకు జనాలిచ్చిన అధికారంతో ఏకపక్షంగానే  అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు ఆర్కె ఒప్పుకున్నట్లే కదా ?

 

అమరావతిని రాజధానిగా మిగిలిన జిల్లాల జనాలు ఇష్టపడలేదని ఆయనే తాజాగా అంగీకరించారు. జగన్ మూడు రాజధానులను ప్రకటించే వరకూ అమరావతిని రాజధానిగా సొంతం చేసుకోవటానికి ఇష్టపడని  రాయలసీమ జనాలు ఇపుడు అమరావతికే సై అంటున్నారట. మొన్నటి వరకూ ఇష్టపడని జనాలు ఇపుడే ఎందుకు సై అంటున్నారో మాత్రం చెత్తపలుకు చెప్పలేదు.

 

అదే సమయంలో దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు రావని జగన్ గురించి చెప్పారు. రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూడా  దురుద్దేశాలతో తీసుకున్నవే అని బయటపెట్టినట్లైంది. అందుకే రాజధాని విషయం ఇంత అసహ్యంగా తయారైందని చెత్తపలుకులో వేమూరి ఒప్పుకుంటున్నట్లే. ముఖ్యమంత్రి కోరినట్లే కమిటిలు నివేదికలు ఇస్తాయని తేల్చేశారు. అదే  నిజమైతే టిడిపి హయాంలో వేసిన కమిటిలు కూడా చంద్రబాబు చెప్పినట్లు నివేదికలు ఇచ్చినట్లే కదా.

 

జగన్ ఇపుడు ప్రతిదానికి అప్పులకు వెళుతున్నారని బోల్డు బాధపడిపోయారు. ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ అప్పులు చేస్తున్నాడంటే అంతకుముందు ఐదేళ్ళు అధికారం వెలగబెట్టిన చంద్రబాబు నిర్వాకమం ఎంత గొప్పగా ఉందో అర్ధమైపోతోంది. చంద్రబాబు ఖజానాను సాంతం నాకేయబట్టే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అప్పుల కోసం తిరుగుతున్నట్లు చెప్పారు.

 

అలాగే చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనలో సచివాలయంకు, గెస్ట్ హౌస్ ల నిర్వహణ, కార్యాలయాల నిర్మాణం, మూడు క్యాంపాఫీసుల పేరుతో ఎన్ని కోట్లరూపాయల ప్రజాధనాన్ని వృధాగా తగలేసినట్లు  ఒప్పుకున్నారు. తెలంగాణా సిఎం కేసియార్ లక్షన్నర కోట్లు అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారట. మరి చంద్రబాబు తెచ్చిన 1.7 లక్షల కోట్ల అప్పులు ఏం చేశారో ఎవరికీ తెలీదు. మరి చెత్తపలుకులో ఆ విషయాన్ని ఆర్కె ఎప్పుడూ చంద్రబాబును ఎందుకు నిలదీయలేదు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: