తెలుగుదేశం పార్టీ , కమలనాథులు కలిసిపోయారా ?,రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనపై ఆ రెండు పార్టీల నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది . అమరావతి నుంచి  రాజధానిని తరలించడానికి వీల్లేదంటోన్న  టీడీపీ నేతలు మాదిరిగానే,  బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ,  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు . టీడీపీ నుంచి ఇటీవల బీజేపీ లో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి  అచ్చం టీడీపీ లైన్ లోనే మాట్లాడుతుండడం చూస్తుంటే అయన ఇంకా టీడీపీ లోనే కొనసాగుతున్నారేమో అన్న అనుమానం రాక మానదు . రాజధానిని అమరావతి నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి వెళ్ళేదంటున్న సుజనా, అందుకు రాజ్యాంగం కూడా ఒప్పుకోదని అంటున్నారు .

 

 రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం  మారిస్తే కేంద్ర చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదని , ఈ విషయమై తాను కేంద్ర పెద్దలతో మాట్లాడినట్లు ఆయన మీడియా తో చెప్పుకొచ్చారు . ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని మార్పు అన్నది రాష్ట్ర వ్యవహారమని , ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసిన విషయం తెల్సిందే . కేంద్ర కూడా ఈ విషయమై ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేసింది లేకపోవడంతో , రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారశైలి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . సుజనా తోపాటు , రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజధాని మార్పు అంశం పై టీడీపీ తో గొంతు కలపడం పట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు .

 

రాజధానిని అమరావతిలోని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ , ప్రధాని మోడీ రాజధాని నిర్మాణం కోసం  శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆయన ఒకరోజు మౌనదీక్షకు కూడా దిగారు .   కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తోన్న బీజేపీ నేతలు , రాజధాని మాత్రం అమరావతిలోని కొనసాగించాలని డిమాండ్ చేస్తుండడం చూస్తుంటే వారు టీడీపీ తో జతకట్టారేమోనన్న అనుమానాలు రాకమానవు . 

మరింత సమాచారం తెలుసుకోండి: