పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాజకీయ నాయకుడిగా కంటే, సినీహీరో గా ఉన్న పాలోయింగే వేరే . తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా , పొరుగు రాష్ట్రాల్లోనూ ఆయన అభిమానులున్నారన్నది నిర్వివాదాంశమే . అయితే ఆ అభిమానులు సాధారణ వ్యక్తులు కాకుండా యువ ఎంపీలు కావడం హాట్ టాఫిక్ గా మారింది . పవన్ ప్రస్తుతం సినీ హీరో గా మాత్రమే  కొనసాగి ఉంటే అంత చర్చ జరిగి ఉండేది కాదేమో ... కానీ ఆయన ప్రస్తుతం  ఒక పార్టీ అధినేత కూడా కావడంతోనే ఆ ఇద్దరు యువ ఎంపీలు, ఆయన్ని  ఎందుకు కలిశారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది .  

 

బీజేపీ కి చెందిన బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా లు పవన్ తో భేటీ అయ్యారు . పవన్ తో కలిసినందుకు ఇద్దరు యువ ఎంపీలు తెగ ఆనందపడిపోయారు . పవన్ తో తాము భేటీ అయిన విషయాన్ని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . తాను కాలేజీ చదివే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలను చూసేవాడిని , ఆయన్ని ఎంతగానో అభిమానించే వాణ్ణి , ఈ రోజు ఆయన్ని తాను తేజస్వి సూర్య కలువడం జరిగిందని ప్రతాప్ సింహా వెల్లడించారు . ఇక చివరగా థాంక్యూ పవన్ సర్ , విశ్వ గారు అంటూ ముగింపునిచ్చి , తమ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పకనే చెప్పారు .

 

 ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ , బీజేపీకి అనుకూల విధానాన్ని తీసుకున్నట్లు కన్పించారు . మోడీ, అమిత్ షా నాయకత్వాన్ని అభినందిస్తూ , తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని వ్యతిరేకించిన విషయం తెల్సిందే . ఈ  నేపధ్యం లో బీజేపీ ఎంపీలు ఆయన్ని కలువడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: