ఔను. సెల్ఫీ దిగితేనే ఫైన్ వేస్తారు. 1100 రూపాయ‌లు జ‌రిమానా క‌ట్టాల్సిందే. ఎక్క‌డో తెలుసా? హైద‌రాబాద్‌ బ‌యోడైవ‌ర్సిటీ ఫ్లైఓవ‌ర్ వ‌ద్ద‌. షేక్‌పేట్‌ వైపు నుంచి హైటెక్‌సిటీ వైపు వెళ్లే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ గత నవంబర్‌లో ప్రారంభించగా, మూడు వారాల్లోనే రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో నవంబర్‌ 23న ఫ్లైఓవర్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. ఫ్లైఓవర్‌పై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రక్షణ చర్యలు ఏర్పాటుచేసిన తరువాతే ట్రాఫిక్‌ను అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఆధారంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్‌పై తగిన రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. శనివారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సహా ఇంజినీరింగ్‌ అధికారులు ఫ్లైఓవర్‌ను సందర్శించి రక్షణ చర్యలను పరిశీలించారు. వారు సంతృప్తిచెందిన అనంతరం ట్రాఫిక్‌ను అనుమతించారు.

 

అయితే, అనేక ష‌ర‌తులు విధించారు. వీటి గురించి గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వివ‌రించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఫ్లైఓవర్‌ ప్రారంభం నుంచి వైట్‌ సిమెంట్‌తో రంబుల్‌ స్ట్రిప్స్‌, 40 కిలోమీటర్ల వేగ పరిమితిని గుర్తుచేసే పెయింటింగ్‌, రబ్బర్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌, మలుపుల వద్ద మూడున్నర అడుగుల ఎత్తున క్రాస్‌ బారియర్స్‌ను ఏర్పాటు చేశామని, ఫ్లైఓవర్‌పై సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించినట్లు తెలిపారు. 24గంటలపాటు సీసీ కెమేరాల ద్వారా వాహనాల వేగాన్ని నమోదు చేసి నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని మేయ‌ర్ వెల్ల‌డించారు. వేగ పరిమితిని అతిక్రమించిన వాహనదారులు, సెల్ఫీలు తీసుకునేవారికి రూ. 1100 చొప్పున జరిమానాలు విధిస్తామని మేయ‌ర్ ప్ర‌క‌టించారు. నెలరోజులపాటు వాహనాల వేగాన్ని పరిశీలించి, వాహనదారుల ప్రవర్తన ఆధారంగా అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు చేపడతామన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల సూచనలకు అనుగుణంగా వాహనదారులు నడుచుకోవాలని మేయర్‌ విజ్ఞప్తిచేశారు. 

 

ఇక ప్ర‌మాదం గురించి వివ‌రిస్తూ... రోడ్డు భద్రత, నాణ్యత, డిజైన్లకు సంబంధించిన జాతీయస్థాయి నిపుణుల కమిటీ తమ అధ్యయనంలో భాగంగా నెలరోజుల్లో పదిసార్లు ఫ్లైఓవర్‌ను సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించినట్లు మేయర్‌ వెల్లడించారు. వారిచ్చిన నివేదిక ప్రకారం జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన రక్షణ చర్యలను కూడా పలుదఫాలు కమిటీ పరిశీలించి అనంతరం వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో లోపాలు లేవని కమిటీ తేల్చిందని, వేగం 40కిలోమీటర్లు దాటడంవల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు కూడా వారు స్పష్టం చేసినట్లు మేయర్‌ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: