టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌నిప్పుడు పొలిటిక‌ల్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఘోర  ఓట‌మి పాల‌యిన త‌ర్వాత‌...జేసీ పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అదే స‌మ‌యంలో ఆయ‌న్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. త‌న‌దైన శైలిలో చేసిన వివాదాస్ప‌ద కామెంట్ల నేప‌థ్యంలో ఈయ‌నిప్పుడు పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, ఇదే స‌మ‌యంలో...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. తాను బీజేపీలో చేరాలంటే...ప్ర‌పంచ‌వ్యాప్తంగా కీల‌క‌మైన అంశానికి ప‌రిష్కారం చూపాల‌న్నారు. అదే పీఓకే విలీనం.

 

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులను కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జేసీ..తమ గవర్నమెంట్ వచ్చాక బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. జేసీ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఓ రేంజ్‌లో ఫైరయ్యింది. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదుతో  ఆయనపై అనంతపురం రూరల్ పోలీస్ సెక్షన్ 153, 506 కింద కేసు నమోదైంది. ఈ కేసుపై జేసీ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండంతో, పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. ఇక నెలకు రెండుసార్లు  సమీప పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయమని కోర్టు జేసీ దివాకర్ రెడ్డిని ఆదేశించింది. 

 

ఇదే స‌మ‌యంలో ఆయ‌న అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను కలిశారు. అనంతరం మాట్లాడిన మ‌ళ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రాంతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందన్నారు. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి  సాధ్యమన్నారు. ఆర్టికల్ 370 ని రద్దును సమర్థిస్తానన్నారు. కొన్నివిషయాల్లో మోడీకి జై కొట్టాల్సిందేనన్నారు. అవ‌స‌ర‌మైతే తాను బీజేపీలో చేరతానని చెప్పిన జేసీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను మోడీ స్వాధీనం చేసుకుంటేనే బీజేపీలో చేరతానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
ప్ర‌స్తుతం కాలంలో టీడీపీ నేత‌లు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న దోర‌ణి పెద్ద ఎత్తున క‌నిపిస్తుండ‌గా....పీవోకేను భారత్‌లో కలిపితేనే కాషాయ పార్టీలో చేరతానని ఏకంగా ప్ర‌ధాని మోదీకే జేసీ ష‌ర‌తు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: