హైద‌రాబాద్ వాసి చ‌రితారెడ్డి అమెరికాలోని మిషిగన్‌లో గతనెల 27 జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆక‌స్మికంగా క‌న్నుమూయ‌డం ఎంద‌రినో క‌లచివేస్తోంది. అమెరికాలో అవయవ దానం పూర్తయ్యాక చరితారెడ్డి మృతదేహం పదిరోజుల తర్వాత ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది.  శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అంబులెన్స్‌లో ఉదయం 11 గంటలకు నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌లోని వారి ఇంటికి తీసుకొచ్చారు. చరితారెడ్డి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు చంద్రారెడ్డి, శోభ, బోరున విలపించారు. మధ్యాహ్నం 2 గంటలకు నేరేడ్‌మెట్‌లోని భరణికాలనీ శ్మశానవాటికలోఅంత్యక్రియలు నిర్వహించారు. చరితారెడ్డికి కుటుంబసభ్యులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

 

చిన్న వయస్సులోనే ఉన్నతస్థాయికి చేరుకున్న చరితారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం భాదాకరం. అయితే, చ‌రితారెడ్డి మృతి విష‌యంలో ఆమె స్నేహితురాలు అనుషారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చరితారెడ్డి తన వివాహానికి వచ్చి ఉంటే బతికి ఉండేదని వరంగల్‌కు చెందిన ఆమె స్నేహితురాలు అనూషారెడ్డి అన్నారు. ఆదివారం చరితారెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన ఆమె మాట్లాడుతూ.. షికాగోలో తామిద్దరం ఒకే రూములో ఉండేవారమని చెప్పారు. డిసెంబర్‌ 28న తన వివాహం కోసం ఆహ్వానించ‌గా...రావ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం చేసింద‌ని పేర్కొన్నారు. అయితే, సెలవు లభించకపోవడంతో రాలేకపోయిందని, వచ్చి ఉంటే బతికి ఉండేదని అనూషారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 


చరితారెడ్డి నాలుగేళ్ల‌ క్రితమే అమెరికాలోని మిషిగన్‌కు వెళ్లారు. అక్కడే ఎంఎస్‌ పూర్తిచేశారు. ఎంఎస్‌ తర్వాత డెలాయిట్‌లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడ్డారు. గ‌త‌ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వారాంతం వెకేషన్‌ కోసం చరితారెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మిచిగాన్‌ నుంచి సిటీ బయటి ప్రాంతానికి వెళ్తున్నారు. మిషిగాన్‌లోని క్రాకెర్రి టౌన్‌షిప్‌ వద్ద డ్రైవర్‌ మారేందుకు కారు ఆపారు. పార్కింగ్‌ లైట్లు కూడా వేశారు. కారు వెనుక సీటులో చరితారెడ్డితోపాటు మరో స్నేహితురాలు, ముందు సీటులో ఇద్దరు కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి కారులో మద్యం మత్తులో 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి వీరి కారును ఢీకొట్టాడు. కారు వెనుక సీటులో కూర్చున్న చరితారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె స్నేహితులు దవాఖానకు తీసుకెళ్లారు. బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు వైద్యులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: