గ‌త కొంత‌కాలంగా, వరుసగా తెలంగాణ‌లోని మంత్రులంతా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు జై కొడుతున్న తీరు, పార్టీ శ్రేణులలో చ‌ర్చ‌నీయాశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ మున్సిపల్ ఎన్నిక‌లు పూర్త‌య్యాక కేటీఆర్‌కు పట్టాభిషేకం జరుగుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి తోడుగా... పది రోజులుగా సొంత పార్టీ శ్రేణులే ఈ క్యాంపెయిన్ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. స్వయంగా మంత్రులు, పార్టీ ముఖ్యులు సీఎం కేసీఆర్ తర్వాత కాబోయే తెలంగాణ సీఎం కేటీఆరేనంటూ జపం చేస్తుండ‌గా..ఇదే స‌మ‌యంలో మునుపెన్న‌డూ లేని రీతిలో...టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరుమ‌ల టూర్ చ‌ర్చ‌కు తెర‌లేపింది.

 


ఇటీవ‌ల జ‌రిగిన  పంచాయతీ ఎలక్షన్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్నీ తానై చక్రం తిప్పారు. హుజూర్‌న‌గర్ ఉప ఎన్నికకు కేసీఆర్ దూరంగా ఉన్నా కేటీఆర్ భారీ మెజారిటీతో గెలిపించిన ముద్ర వేసుకున్నారు. ఈలోగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో మళ్లీ కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారం మొదలైంది. పార్టీ నేతలందరూ కేటీఆర్ కేంద్రంగా ఆయన చుట్టూ తిరిగేలా చేసే ప్లాన్ లో భాగంగానే ఈ ప్రచారం మొదలైనట్లు కొందరు సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. 

 

ఏదేమైన‌ప్ప‌టికీ, దేవుడు, భ‌క్తి అంటేనే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని కేటీఆర్ తాజాగా తిరుమ‌ల ద‌ర్శ‌నం చేసుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గ‌తంలో, మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలో త‌న తండ్రి కేసీఆర్ స‌హా మిగ‌తావారంతా దైవ‌సాక్షిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్నాను అని పేర్కొంటే కేటీఆర్ ఒక్క‌రే ఆత్మ‌సాక్షిగా అని ప్ర‌క‌టించారు. అంద‌టి విభిన్న‌మైన వ్య‌క్తిత్వం ఉన్న కేటీఆర్...వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని క‌లియుగ దైవం, కోరిన కోరిక‌లు తీసే దేవుడిగా పేరొంది తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్ ప‌ట్టాభిషేకం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో... ఈ ద‌ర్శ‌న‌మా అనే చ‌ర్చ సహ‌జంగానే జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: