13 నెలల నుండి పాకిస్తాన్ చెరలో బంధీలుగా ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు విముక్తి లభించింది. జగన్ ఆదేశాలతో మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులను తీసుకొనివచ్చేందుకు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘాకు వెళ్లారు. సీఎం ఆదేశాలతో వాఘా బోర్డర్ కు నిన్న పయనమైన మోపిదేవి కొద్దిసేపటి క్రితం వాఘాకు చేరుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాక్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల విడుదల కొరకు చాలా కృషి చేశారు. 
 
ఆ కృషి ఫలితంగా పాక్ చెరలో బంధీలుగా ఉన్న మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమమైంది. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జాలర్లు పొట్టకూటికోసం గుజరాత్ కు వెళ్లారు. 2018 సంవత్సరంలో డిసెంబర్ నెలలో పాక్ జలాశయాల్లోకి మత్స్యకారులు ప్రవేశించడంతో పాక్ కోస్ట్ గార్డులకు చిక్కారు. ఈ విషయం తెలిసిన జాలర్ల కుటుంబాలు 13 నెలల నుండి తమ వారిని విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి. 
 
ఏపీ ఎంపీలు జాలర్లను విడిపించాలని పలుమార్లు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖలు రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ పాక్ తో ఉత్తరాంధ్ర మత్స్యకారుల గురించి చర్చలు జరిపి మత్స్యకారులను విడిచిపెట్టాలని కోరగా పాక్ ప్రభుత్వం మత్స్యకారులను విడిచిపెట్టానికి అంగీకారం తెలిపింది. పాక్ అంగీకారం తెలపడంతో 20 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. 
 
జనవరి నెల 4వ తేదీన భారత విదేశాంగ శాఖకు పాక్ ప్రభుత్వం నుండి మత్స్యకారుల విడుదలకు అంగీకారం తెలిపినట్లు సమాచారం అందింది. తాము విడుదల చేయబోతున్న మత్స్యకారుల జాబితాను కూడా పాక్ ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు పంపించింది. ఈరోజు సాయంత్రం భారత అధికారులకు పాక్ ప్రభుత్వం మత్స్యకారులను అప్పగించనుంది. జాలర్లను అప్పగించిన అనంతరం వారిని మోపిదేవి వెంకటరమణ రాష్ట్రానికి తీసుకొనివస్తారు. మత్స్యకారులు విడుదల కావడం పట్ల జాలర్ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: