పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు కోరడం.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం..! ఇక్కడ వరకూ చదివితే ఈ వేధింపులు, ఆత్మహత్యకు పాల్పడింది యువతి అనుకోవడం ఖాయం. కానీ.. ఇక్కడ ఈ పరిస్థితికి బలైంది ఓ పురుషుడు. పెళ్లైన ఆరు నెలలకే అత్తింటి వారు తమ కూతురుకు విడాకులు ఇవ్వాలని కోరుతూ వేధించడంతో తట్టుకోలేక, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర విస్మయం, విస్తుగొలిపే ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని అమరావతి మండల కేంద్రంలో  జరిగింది.

 

 

స్థానికంగా నివాసం ఉంటున్న పల్లపు తిరుపతిరావు (22) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. రెండు నెలలు సజావుగానే సాగిన వీరి కాపురంలో అలజడి రేగింది. నాలుగు నెలల నుంచి అత్తవారింట్లోనే నివాసం ఉంటున్న తిరుపతి రావుకు ఈమధ్య వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తమ కూతురుకి విడాకులివ్వాలని వేధించసాగారు. తమ కుటుంబానికి చెందిన బంధువు రేపిన చిచ్చు తిరుపతిరావు ఆత్మహత్యకు దారి తీసింది. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించాలని సదరు బంధువు ప్రస్తావన తీసుకొచ్చాడు. ధనవంతుల కుటుంబం కావడంతో కూతురు సుఖపడుతుందని ఆత్యాశపడిన అత్తమామలు తిరుపతి రావును వేధించసాగారు. కూతురి మనసు కూడా మార్చేయడంతో ఆమె కూడా భర్తను విడాకులు కావాలని వేధించసాగింది.

 

 

ఈ నేపథ్యంలో పనికి వెళ్లిన తిరుపతి రావును కలిసి భర్తతో వాగ్వాదం పెట్టుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన తిరుపతి రావు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తిరుపతి రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తింటి వేధింపులు తట్టుకోలకే తిరుపతి రావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: