ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు ముందుకు హజీపూర్ వరుస హత్యల కేసు విచారణకు రానుంది. ఇప్పటికే ఈ కేసులో విచారణ తుది దశకు చేరుకోగా మరికొద్ది రోజుల్లో ఈ కేసులో తుదితీర్పు రానుంది. ఈ కేసు కోసం పోలీసులు దాదాపు 101 మంది సాక్ష్యులను విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు ఇప్పటికే తీసుకున్నారు. న్యాయస్థానం ఈరోజు ఇరుపక్షాల వాదనలను విననుంది. 
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ వరుస హత్యల కేసులో అతి త్వరలో తుదితీర్పు రానున్నట్టు సమాచారం. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం మరియు హత్య చేశాడనే ఆరోపణలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈరోజు విచారణ తరువాత ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరిసారి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు తీసుకోనుంది. 
 
గత విచారణలలో శ్రీనివాస్ రెడ్డి ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని తనకు కావాలని ఈ కేసులోకి లాగారని చెప్పాడు. తన భూమికి సంబంధించిన డబ్బుల కోసం తనను ఇరికించారని కూడా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. ఈరోజు కోర్టు నిందితుడి నుండి వాంగ్మూలం తీసుకున్న అనంతరం రానున్న రెండు మూడు రోజుల్లో తుది తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. 
 
కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి యావజ్జీవ శిక్ష వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ముగ్గురు మైనర్ బాలికలను అతి క్రూరంగా అత్యాచారం చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గడచిన మూడు నెలలుగా ఈ కేసు గురించి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో గ్రామస్థులు నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అని గ్రామస్థులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: