ఇరాన్ సైనిక క‌మాండ‌ర్ సులేమానీనే అమెరికా ద‌ళాలు చంపేయ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భార‌త్‌ను కూడా లాగారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ . ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త లక్ష్యంగా 2012లో ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడికి సులేమానీనే సూత్రధారి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ విష‌యంలో భారత్‌లోని ఇరాన్‌ రాయబారి అలీ చెగెనీ స్పందించారు. ట్రంప్ కామెంట్లు అవాస్తవమని ఇరాన్‌ రాయబారి  ఖండించారు. 

 

‘ట్రంప్‌ తనకు ఏది నచ్చితే అది చెబుతారు. ఢిల్లీ ఉగ్రదాడికి సులేమానీ సూత్రధారి అనడం పెద్ద అబద్ధం. జనరల్‌ సులేమానీ సైనికుడు. అమాయకులపై ఆయన ఏనాడూ దాడులకు పాల్పడలేదు’ అని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఐఎస్‌ఐఎస్‌, జభత్‌ అల్‌ నుస్రా, అల్‌ ఖైదాకు వ్యతిరేకంగా పోరాడిన సులేమానీపై అమెరికా దాడి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే`` అని వ్యాఖ్యానించారు.ఇరాన్‌కు విశ్వసనీయ మిత్రదేశమైన భారత్ సులేమానీ హ‌త్య‌ను ఖండిస్తుందని భావిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ చట్టాలను పాటించేలా, గల్ఫ్‌లో అస్థిరతకు పాల్పడకుండా చూసేలా అమెరికాకు సూచిస్తుందని ఆశిస్తున్నామని న్నారు.

 


మ‌రోవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిణామాలు ప్రమాదకర మలుపు తీసుకున్నాయని, దీనిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపింది. ఆదివారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావెద్‌ జారిఫ్‌కు ఫోన్‌ చేశారు. అనంతరం జైశంకర్‌ ట్వీట్‌ చేస్తూ ‘ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావెద్‌ జారిఫ్‌తో ఇప్పుడే మాట్లాడాను. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాను. అక్కడ పరిణామాలు ప్రమాదకర మలుపు తీసుకున్నాయని, దీనిపై భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. మళ్లీ ఓ సారి మాట్లాడుకోవాలని ఇరువురం నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: