దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఢిల్లీ శాసనసభ గ‌డ‌వు వ‌చ్చే ఫిబ్రవరి 22తో ముగియనున్న నేప‌థ్యంలో ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల అధికారి సునీల్ అరోడా విడుదల చేశారు. వచ్చే ఫిబ్ర‌వ‌రి 8న పోలింగ్ నిర్వ‌హించ‌నుండ‌గా.....12న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.13,750 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈసీ లెక్కల ప్రకారం 2020 జనవరి 6 నాటికి ఢిల్లీలో 1,46,92,136 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్ల‌డించింది.

 


జనవరి 12న  నోటిఫికేషన్​ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అరోరా వెల్ల‌డించారు. జనవరి 14 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని అదే నెల 21తో గ‌డువు ముగుస్తుంద‌ని వెల్ల‌డించారు. నామినేష‌న్ల ఉపసంహరణకు తుది గడువు జ‌న‌వరి 28. ఫిబ్రవరి 8న నిర్వ‌హించ‌నున్నారు. అదే నెల 11న  ఫలితాలు వెల్ల‌డి కానున్నాయి.

 

గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఈ నగరంలో జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. ఇకపోతే గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై ప్ర‌ధానంగా ఆప్‌, కాంగ్రెస్ ఫోక‌స్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే బీజేపీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టింది. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) ప్రజలను తప్పుదోవ పట్టించి, అల్లర్లకు కారణమవుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ముఖ్యంగా ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మైనార్టీల పౌరసత్వాన్ని రద్దు చేసే నిబంధన ఏదీ సీఏఏలో లేదని స్పష్టం చేశారు. సీఏఏ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ చేపట్టిన ‘జన్‌ జాగరణ్‌' కార్యక్రమాన్ని అమిత్‌ షా ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: