కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఫిబ్రబరి నెల 8వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. 13,767 పోలింగ్ కేంద్రాలను ఢిల్లీ ఎన్నికల నిర్వహణ కొరకు ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 22వ తేదీన గడువు ముగియనుండగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను వెల్లడించింది. 
 
ఎన్నికల కోడ్ ఢిల్లీ వ్యాప్తంగా ఈరోజు నుండి అమలులోకి వచ్చింది. దాదాపు 90వేల మంది సిబ్బంది ఈ ఎన్నికల కోసం పని చేయనున్నారు. ఒక కోటీ 46 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ సీఈవో రణవీర్ సింగ్ ఈ విషయాలను ప్రకటించారు. 
 
66.35 లక్షల మహిళా ఓటర్లు, 80.56 లక్షల మంది పురుష ఓటర్లు ఢిల్లీ నగరంలో ఉన్నారు. 2019 మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ కూడా అదే రోజు నుండి ప్రారంభమవుతుందని సునీల్ అరోరా తెలిపారు. 
 
జనవరి 21వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా జనవరి 23వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. జనవరి 24వ తేదీని నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజుగా ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్ కు ఏపీ సీఎం జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: