జగన్ అధికారంలోకి వచ్చాక.. భారీ సంస్థలన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని.. కొత్తగా పెట్టుబడులు రావడం లేదని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విశాఖలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అదానీ సంస్థ ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూనే ఉందంటున్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

 

అయితే ఈ సంస్థ ఇప్పటికే విశాఖలో పెట్టుబడి ప్రతిపాదనలను వెనక్కు తీసుకుందని టీడీపీ ప్రచారం చేస్తోంది. లులు సంస్థను ఏపీ సర్కారు వెనక్కిపంపేసిందట. ఇలాంటి ప్రచారాలు జగన్ సర్కారుకు అంత మంచిది కాదని వైసీపీ నాయకులు భావిస్తున్న సమయంలో తాజాగా అదానీ సంస్థ వైజాగ్ లో పెట్టుబడి పెట్టబోతోందన్న వార్త ఆ పార్టీ నేతలకు సంతోషం కలిగించేదే.

 

సరికొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలను తయారు చేసి వచ్చే బడ్జెట్ లో ప్రవేశ పెడతామని గౌతంరెడ్డి చెబుతున్నారు. అదానీ కంపెనీ వెళ్లిపోతోందంటూ ప్రతిపక్షాలు చేస్త్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. 400ఎకరాల్లో 70వేల కోట్ల పెట్టుబడితో గత ప్రభుత్వం అదానీ పరిశ్రమను తీసుకువచ్చామని చెబుతోన్న లెక్కలు అవాస్తవమన్న గౌతమ్ రెడ్డి....3 - 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆ సంస్థ పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.

 

రేణిగుంట ఈఎంసీల్లో గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అందిన ప్రయోజనాలపై విచారణ జరుగుతోందని గౌతమ్ రెడ్డి అన్నారు. తప్పు చేసినవారిపై చర్యలు తప్పవన్నారు. విశాఖ పారిశ్రామిక సదస్సులు పెట్టి గత ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల్లో 10 శాతం పెట్టుబడులు సైతం రాష్ట్రానికి రాలేదన్న గౌతం రెడ్డి.. మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌదీ అరేబియాకు చెందిన మూడు పరిశ్రమలను రాష్ట్రానికి వైసీపీ సర్కారు తీసుకువస్తున్నట్లు తెలిపారు.

 

చిత్తూరు జిల్లాలో ఈ నెల 9న అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ పర్యటించి ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి పథకాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించటం సంతోషకరమని గౌతమ్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: