పాత్రికేయం.. ఇదో పవిత్రమైన వృత్తి వ్యాసంగం. సమాజ హితం కాంక్షిస్తూ.. సమాజాన్ని ప్రతిబింబిస్తూ కొనసాగే ఈ వృత్తి.. ఎంతో ఆత్మ సంతృప్తినిస్తుంది. జర్నలిస్టు రాసే ఓ వార్త ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు.. కొన్ని జీవితాల్లో మనం రాసే వార్తలు ప్రభావితం చేసినప్పుడు అందులో ఉండే ఆనందం ఎంత డబ్బు ఇచ్చినా కొనలేనిదే.

 

అయితే అన్ని వృత్తుల్లాగానే పాత్రికేయం కూడా చెడిపోయిందని.. జర్నలిస్టులు లంచాలకు మరుగుతున్నారని ఓ అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలం, జిల్లాస్థాయిలో జర్నలిస్టులు ఓ జట్టుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడే వర్గాలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తుంటారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇందులో వాస్తవాలు లేకపోలేదు.

 

కానీ దీని వెనుక ఉన్న అసలు వాస్తవం చాలా మందికి తెలియదు. మండల స్థాయిలో పత్రికలు, ఛానళ్ల కోసం పని చేసేవారిని జనం రిపోర్టర్ గా పిలుచుకున్నా సంస్థలు వారిని కంట్రిబ్యూటర్లు అంటాయి. ఈ కంట్రిబ్యూటర్లు సంస్థ ఉద్యోగులు కారు. వీరికి నెల జీతాలు ఉండవు. అసలు చాలా సంస్థలు వీరికి ఎలాంటి వేతనాలు చెల్లించవు. కొన్ని అగ్రశ్రేణి పత్రికలు మాత్రం వారి వార్త ప్రచురితమైతే మాత్రం నామమాత్రపు పారితోషకం ఇస్తాయి. ఈ మొత్తం చాలాసార్లు 5-6 వేలు మాత్రమే ఉంటుంది. దీన్నే లైన్ ఎకౌంట్ అంటారు.

 

మరి ఈస్థాయి రాబడితో ఏ కుటుంబమైన బతుకుతుందా..మరి ఆ మాత్రం ఇవ్వని సంస్థల పాత్రికేయులు ఎలా బతుకుతారు.. అంటే పరోక్షంగా పత్రికలు, ఛానళ్ల యాజమాన్యాలే వారిని అనేక రకాల దందాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాయన్నమాట. చాలా మంది ప్రెస్ అని చెప్పుకోవడంలో ఉండే గౌరవం, పరపతి కోసం.. వార్తలు రాస్తే వచ్చే క్రేజ్ కోసం మండల, జిల్లా స్థాయిల్లో పని చేస్తుంటారు.

 

జీతం, బత్తెం లేని నౌకరీతో కుటుంబాలు గడవవు కాబట్టి.. ఇలాంటి పాత్రికేయులు దందాలకు అలవాటు పడతాయి. కొన్నిపత్రికలు ఇలాంటి మండల స్థాయి పత్రికలకు సర్క్యులేషన్ టార్గెట్లు కూడా పెట్టి వేధిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల కారణంగానే పాత్రికేయులు లంచాలు తీసుకుంటుంటారు. అంటే ఈ లంచాల్లో పాత్రికేయులతో పాటు.. వాటి యాజమాన్యాలకూ పరోక్షంగా వాటా ఉన్నట్టేగా.. ఇదీ కిందిస్థాయి రిపోర్టర్ కాదు కాదు.. కంట్రిబ్యూటర్ల దుస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: